Saturday, June 4, 2022

రంగు వెలసిన మొఖాలు తేదీ 17-12-2021 శీర్షిక : నిజాల గొడుగు ....

 రంగు వెలసిన మొఖాలు 

తేదీ 17-12-2021
శీర్షిక :  నిజాల గొడుగు .... 
కవిత సంఖ్య : 809

ఊహల ఉయ్యాలలు ఉచ్ఛస్థితిలో 
ఊరేగుదామనుకున్నప్పుడు...వాస్తవాల 
వసంతాలు పరిమళాలు వెదజల్లకుండా  .... 
మోడువారి వెక్కిరిస్తుంటే జరిగే పరిణామం .... 

జగం ఎరిగిన జంగమయ్యలకయినా 
జనం మెచ్చి నచ్చాలంటే తెచ్చి పెట్టుకునే 
రంగుల హంగులెన్నో ఆశ్రయించాల్సిందే...
అలనాటి నాటకరంగంలా .... 

సాంకేతికతల సహకారాల అడుగుజాడలతో  
వేగమందుకున్న సెల్యులాయిడ్ ల వెలుగుల్లో.. 
సహజసిద్దాల సంప్రదాయాల మూటలైన నాటి 
కళారంగం సమూలంగా వెలిసిపోయి తెల్లబోతున్నాయి ...... 

పల్లెపట్టున తోబుట్టువుల బంధాల్లా పుట్ట తేనెలై 
మధురిమలు పంచినా.... పట్నపు వాసనలు 
పుటాలకు తగలగానే... పుట్టు పూర్వోత్తరాలనే  
మరిచిపోయి ... కుళ్ళునే శ్వాసిస్తూ కుతంత్రాలకు 
కుదువ పెట్టబడి మానవత్వాలనే మరిచిపోతున్నారు ......  

అధికార పీఠాల వేటలో... అంగలార్చుకున్న 
స్వార్థ చింతనలు ... ఉచితానుచితాల ఊసులన్నీ 
చెప్పేసి ...ఓడెక్కేదాకా ఓడమల్లప్ప తదుపరేమో ... 
బోడ మల్లప్పలా....బొడ్లో వరహాలు పోసుకున్న చందం ... 
రంగులు మార్చే రాజకీయాలు ....నిజాల వాకిట
తదుపరి నీరు కారి పోతున్నాయి… 

కాలమానాలకు తాత్కాలికంగా కనుమరుగైనా... 
నిలకడగా నిజాలు నిగ్గు తేలినట్టు... ఉనికి మార్చుకునే 
ఊసరవెల్లుల రంగులైనా సరే .... నిప్పులాంటి 
నిజాలకు కణ కణ మాడి నిజాల గొడుగులో దూరాల్సిందే ..... 

నగునూరి రాజన్న 
కరినగరము

No comments:

Post a Comment