Sunday, June 5, 2022

రైతు తేది: 23-12-2021 శీర్షిక: హాలికుడు

 రైతు

తేది: 23-12-2021
శీర్షిక: హాలికుడు 
కవిత సంఖ్య: 

రాజటువంటి రైతు బంటయితేనే
మనమంతా బతికి బట్ట కట్టేది
రైతు మట్టి పిసికితేనే…మనమంతా ఆహారం తిన గలిగేది….

రక రకాల రైతు ఆత్మ హత్యలు వింటుంటే….
రక్తము నీరవుతుంది ఎలాంటి  రాజుకైనా 
రాతి మనుసు కలిగిన దళారులకు, వ్యాపారులకు…మరి
రాదు ఎందుకో రవ్వంత కనికరము…

అప్పులిచ్చు ఆసాములు మొదలుకుని 
అరువుగా ఎరువులు,విత్తనాలిచ్చే వారి వరకు 
అవినీతి అధికారుల అమ్యామ్యాలతో 
(భూసార పరీక్ష, నీటి పారుదల , విద్యుత్, వ్యవసాయ మార్కెట్
ఆఖరకు వ్యాపార బాంకులు సైతం….)

పట్టనే పట్టదెవరికి గిట్టు బాటు చేద్దాం రైతుకని….
పందికొక్కులవలె పిండి పిప్పి చేసి 
పట్టెడన్నం పెట్టె అపర అన్నపూర్ణ రైతన్నను….
పరాభవిస్తూనే పలాయనం చిత్తగిస్తూన్నారు ….

అసలు సిసలు వరి, గోదుమ , జొన్నే  కాకుండా 
ఆరు తడులతో పూలు,పండ్లు, కూరగాయలు పండించే 
అరక దున్నే రైతన్నలను అదను చూసి కాటేయ 
అబగా కాచుకుంటున్నారు అంగడి దళారులు . 

పంటలకు పని చేయని నకిలీ మందులు మాత్రం… 
పక్కాగా ఆత్మ హత్యలకేమో పని చేసి…. 
ఆరుగాలం కష్టపడ్డ రైతన్నను మింగేస్తూ
ఆలు బిడ్డలను రోడ్డున కీడ్చుతున్నాయి….

అప్పుల తిప్పలే కాకుండా ఆ కుటుంబాలలో 
ఆలనా పాలనలు కరువయిన పిల్లలు 
అటకెక్కిన చదువు సంధ్యలతో 
అలితేరే ఆరోగ్యాల, ఆలోచనా సరళిలతో….
సవాలు విసరరా తిరిగి సంఘానికి…  

పారా హుషార్.....  పౌరులారా, ప్రభుత్వాల్లారా
పరామర్శించే స్వచ్చంద సేవా సంస్థల్లారా…
ప్రతీ వారు మేల్కొనాల్సిందే... అడుగేయాల్సిందే.... 
పాప పంకిలాలను పారద్రోలుటకు......  

నగునూరి రాజన్న
కరీంనగర్. 

No comments:

Post a Comment