Saturday, February 12, 2022

నేను అడవిని మాట్లాడుతున్నా ! తేది : 07-12-2021 శీర్షిక : అమృత భండాగారం

 నేను అడవిని మాట్లాడుతున్నా ! 

తేది : 07-12-2021
శీర్షిక : అమృత భండాగారం 
కవిత సంఖ్య : 808     

అచ్చంగా పచ్చలారబోసుకున్న 
నిండు ముతైదువైన అమ్మనురా .... 
పోలికేకలకు పొంగిపోయే నింగినంటే 
వృక్షాలతో ... పండు ఫలములు మెండుగా 
ఇచ్చి పిల్లా పాపాలను కనిపెట్టుకునే దానినిరా  .... 

కాలుష్యాలనెరుగని కలివిడి నిండిన 
సమశీతోష్ణస్థితులకై ... హరితములను 
నిలిపే .... స్వచ్ఛమైన పర్యావరణాలనిస్తూ ... 
సర్వ జీవరాశికి సరిపడే ... కొండా కోనల 
సెలయేళ్ళను పురివిప్పి కోరి నింపుకున్నాను .....  
ఒకప్పుడు ..... 

పగులుతున్న గుండెల్లాంటి గుట్టలను 
విరుగుతున్న కండల్లాంటి తరువులను... మోస్తూ
కాలుష్యాల చేత కబళిస్తున్న  విశ్వం .... 
విషతుల్యాలు నింపుకున్న రసాయనాలతో 
ఒకటొకటిగా అంతర్థానమౌతున్న స్నేహ 
సౌహార్దాలు పంచే జీవరాశుల ప్రతినిధినై 
పలుకుతున్నానురా ..... 

పుట్టుకలనుండి...గిట్టుట వరకు.... 
నాగరికతల నడకల్లో బుడి బుడి 
అడుగులు వేయించి ... పోషించి 
కృశించి ... శోషించి పోతున్నాను నేను ..... 

స్వార్థాల సంచులు తగిలించుకున్న 
రాజ్యాల  రాబందుల పాలనలలో .... 
రాళ్ళన్నీ కరిగిపోతోంటే... నీళ్లన్నీ 
ఇగిరిపోతుంటే ..... ఇసుకంతా 
కుంగిపోతుంటే ...... తరువులన్నీ 
తరలి పోతుంటే .... విచలితమైన 
మనస్సుతో ...అచేతనమై పోతున్నాను ..... 

మాట వినని మల్లన్నలై...మట్టి కరుస్తారో ... 
వివేకాలు ఏరుకుని... జవసత్వాలు 
నాలో నింపి... అమృతాలు వంపుకుంటారో ..... 
అంతా ఇక మీ చేతుల్లోనే ... చేతల్లోనే .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment