Saturday, June 11, 2022

కలల రాణి తేది: 16-09-2021 శీర్షిక : తొలి చూపు

 కలల రాణి 

తేది: 16-09-2021
శీర్షిక : తొలి చూపు
కవిత సంఖ్య : 199

దృష్య సుందరమున కను దోయిల్లో 
బంధించుకున్న క్షణం నుండి
కలలలో ...కలవరింతలలో ... మెలకువలలో ... 
కదలాడే నీ రూపమే  జపమాయె …. 
ప్రతి నిత్యం .. ప్రతి నిమిషం ..... 

ఒళ్ళంతా తుళ్ళింతలై…. 
జీవన గమనంలో … 
బరువు బాధ్యతలన్నీ దూది
పింజములై… అడుగడుగున నీ 
ఆలోచనలతో నింపుకున్న మనోఫలకం…. 

ఇంటా బయటా ఎక్కడున్నా 
ఆటలో పాటలో….అమృతమైన
నీ పలుకులే నాకు శ్వాసలై… 
ప్రాణాలను పట్టి నిలిపింది….. 

వేచిన ఘడియలన్నీ వెన్నంటిరాగా… 
అల్లుకున్న క్షణాలన్నీ అందమైన
ఇంద్రధనస్సై… అవునంటూ  
అమరినది ఓ సుందర దృష్యం …. 
ఒక మంచి ముహూర్తాన….. 

అప్పుడప్పుడు కార్యాలయంలో
ఊపిరాడని పని వేళలలో…. 
శారీరక మానసిక శ్రమలను 
తేలిక చేస్తూ….ఉల్లసింప జేసి 
పలకరించు…నీ మోము కుసుమమే… 

తొలి చూపుల మాయలో .... 
చిరునవ్వుల మాల‌లో .... 
నా జీవితాన్నే నందనవనం చేసి…   
విరుల గంధాలను వెదజల్లి 
అలవోకగా అర్థ జీవితాన్ని దాటించావు ....

అమ్మా నాన్నల ఆశీస్సులో 
ఆ పరంధాముని వరమో ..... 
జన్మ జన్మల ఋణానుబంధమో .... 
ఇలా సాగితే చాలదా ఇకముందు సైతం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment