Sunday, June 5, 2022

మౌన సంభాషణ తేది : 30-12-2021 శీర్షిక : తొలినాళ్ళు

 మౌన సంభాషణ 

తేది : 30-12-2021
శీర్షిక : తొలినాళ్ళు 
కవిత సంఖ్య : 813

మనసున మాట స్థిరమయ్యాక 
చూపులు కలిసిన శుభవేళ అంటూ 
రాగాలన్నీ .... లోలోపలనే .... కలిసిన 
ప్రతీసారీ... దాగుడుమూతల గుంజాటనం .... 

కనులు మూసినా తెరిచినా 
కనపడేది నీ మోహన రూపమే .... 
కంటి పాపలో పదిలపరుచుకుని 
కదలాడేది అడుగడుగునా అన్నింటా .... 

మర్యాదల కట్టుబాటులో ... 
పెద్దల ముందు  గౌరవ మర్యాదలో .... 
కొత్త వారన్న జడుపులో ..... 
ఎలా మొదలెట్టాలా ... అనే 
సంశయాల సంచీతో ఆ క్షణంలో 
పడే తికమకలో .... 

ఎదురుచూపులు ఎదనిండా 
నింపుకుని .... ఎన్నెన్నో ఊసులు 
ఎత్తిపోసుకునే పూర్వాభ్యాసమే .... 
కానీ ....ఎదురుపడితే  మాట పెగలదు.. 
మనసు కోట దాటదు .... 

తొలినాళ్ల ముచ్చట్లన్నీ 
మలి దశ ప్రాణవాయువులు ..... 
మననం చేసుకుంటుంటే 
మల్లె పరిమాళాలు వెదజల్లినట్టు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment