Sunday, June 5, 2022

చిత్ర కవిత --ఆత్మ స్థైర్యం తేది-27-12-2021

 ఆత్మ స్థైర్యం 

తేది-27-12-2021
కవిత సంఖ్య : 195

కాలమంతా కట్టిపెట్టుకున్న 
కడుపులోని పేగులన్నీ కదిలి కదిలి
గాలి నింపంగానే.. బుగ్గలన్నీ 
సప్తవర్ణాలను పొదువుకున్నాయి … 

జీవితాంతం జీతభత్తమెరుగక                 
కాయకష్టం చేసి కన్నోళ్ల కడుపులు 
నింపిన కాయానికి ... ఇప్పుడు కడుపు  
నింపుకునేందుకు  వర్ణమెరుగని 
తెలుపు నలుపుల వరమై దొరికింది .... 

అనాయాసంగా ఐదేళ్లు 
నోటికందించాల్సిన వయసులో 
పొద్దు పొద్దంతా కాళ్ళరిగినా 
తిరగలిలా తిరిగి అమ్ముకుంటున్నా…

కంటి చూపు మందగించి 
జోళ్ళకు వేళ్ళాడినా ... 
వెండి తీగెల శిరోజాలు దండిగా 
వెల్లివిరిసినా .... 
ముడతలు కట్టి చర్మమంతా
ముదిమి వయసు నింపినా ... 
తరగని నీ ఆత్మస్థైర్యానికి 
తన్మయత్వంతో  సెల్యూట్ చేస్తున్నా ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment