Wednesday, May 10, 2023

రవివారం రాగ కణిక అంశం : మాతృత్వం శీర్షిక : కమ్మనైన అమ్మతనం ... (2)

 రవివారం రాగ కణిక 

అంశం : మాతృత్వం 
శీర్షిక : కమ్మనైన అమ్మతనం ... 
13-11-2022

కమ్మనైన అమ్మతనం
ఆడవారికో గొప్ప వరం ... 
కానుపుతో మరోజన్మ 
అయినా వెరవదు  అమ్మ

కండరాల పొత్తిళ్ళలో -
కడుపులోన తొమ్మిది నెలలు
కళ్ళు కాయలు చేసుకుని  
కష్టాలను తాను భరిస్తుంది

పున్నామ నరకాలను  
తాను జయించానని
పురుడు పోసుకాగానే 
సంబరపడి పోతుంది

గట్టిగ లేచి కూర్చుండగ
పట్టు  దొరకక పోయినా …
పొట్టచూసి మురుసుకుని 
పుట్టెడు దీవెనలిస్తుంది...

అడుగు తీసి అడుగేయ 
ఎగుడు దిగుడు దారంతా
పదిలంగా పసికట్టు ప్రమాదం
అల్లంత దూరాన అలవోకగా… 

కాళ్ళు చేతులాడిస్తుంటే
కడుపునిండా తినలేక 
వేవిళ్ళతో సతమతమైనా 
వేయి కళ్ళ ఎదురుచూపులు ... 
 
పసిడి నవ్వుల పాపాయిని
పృథ్విపైన  పరిచయించ
పక్క కూడా కదిలించలేక 
ఉగ్గబట్టు ప్రాణాలు .... 
 
రుధిరం స్తన్యంచేసి 
మధురంగా నింపుతుంది ... 
రోజుల పాపాయిని తాను
రాజులాగా పెంచుతుంది....  

బుగ్గలారి పోకుండా -
ముద్దులెన్నో ఇస్తుంది
చందమామ చూపించి - 
గోరు ముద్దలందిస్తుంది

పసితనాన పాలుతాగి
ఆకతాయిగా జుట్టుపీకితే 
పట్టు విడిపించి ముద్దుగ
గుండెకు హత్తుకుంటుంది ... 

బుల్లి బుల్లి మాటలను - 
పదే పదే  బోధిస్తుంది
బుడి బుడి నడకలను - 
అదే పనిగా నేర్పిస్తుంది

బాలారిష్టాల బాధలతో 
చిన్నపాటి నలతలకే 
చిగురుటాకులా వణికిపోవు… 
చింతలతో అంగలార్చు  ... 

చంటితనం తుంటరిగా  
ఒకటి రెండు చేసినా
ఒడిలోనా ఒంటిపైనా  
భూదేవంత ఓర్పులే .... 

జ్ఞానమెరుగని జీవితాన 
జీవగడియారం తానై
గడియ గడియకు
జవజీవాలకు మెతుకౌతుంది .. 

ఎదుగుతున్న పిల్లలను చూసి- 
మురిసిపోతుంది అమ్మతనం
అక్కున చేర్చుకుని - 
సేద  దీరుతుంది తాను సైతం

యుక్తవసు వచ్చువరకు 
బతుకుబండి నడుచువరకు 
ప్రయోజకులను  చేసాక  
పరవశమై మురిసిపోవు ....   

పదిలంగా కడుపుకట్టి
పదిమందిని సాకును… 
పస్తులుండైనా బయల్పడక  
పరవశించి మురియును…. 

అలసటతో విసిగిన -
 కోపగించి కసిరినా
అన్నీ తానై నిలుస్తుంది - 
అవపొషణ పట్టి అందిస్తుంది

మన కాళ్ళపై మనం నిలబడితే - 
మనసెంతో ఉద్విగ్నమై
మంద్ర హాసంతో స్పందిస్తుంది- 
మమకారం తో దీవిస్తుంది

అమ్మే ఓ ప్రకృతి - అమ్మే ఓ ఆకృతి
అమ్మే ఒక నాదం - అమ్మే ఒక వేదం
అమ్మే ఒక సంస్కృతి - అమ్మే ఒక సాంప్రదాయం
అమ్మే ఒక భక్తి - అమ్మే ఒక ముక్తి

ఆయువుతో పాటుగా 
ఆస్తులు అంతస్తులు 
ఆత్మీయత అనురాగం 
అన్నీ తాను పంచి ఇచ్చు… 

కాల గమనములో మనమంతా - 
కను మరుగౌచున్నాము మిత్రమా
కమ్మనైన అమ్మతనపు - 
గమకాలను గుర్తించక

కమ్మనైన అమ్మ తనం - 
ఆస్వాదిస్తే అద్వితీయం
ఆదరిస్తే అనునిత్యం- 
అవుతుందీ ద్విగుణీకృతమ్

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment