అంశం : నీకూ నాకూ మధ్యన
తేది : 22-11-2022
శీర్షిక : అగాథం ....
గుండెమీద చెయ్యేసుకుని
దండిగా ఎవైరైనా చెప్పగలరా ?
పెంచి పోషించే పోషణకర్తలకే
కళ్ళముందు పుట్టి పెరుగుతున్న
కర్తవ్య దీక్షల కథానాయకుల కదలికలు ....!
కుప్పలు తెప్పలుగా సభ్యులు
కుచ్చుటోపీల్లా కమిటీ పెద్దలు
లెక్కలేనన్ని చిన్నా పెద్ద కమిటీలు
లెక్కకు మించిన విషయలోచనలు ...
ఆలోచనలకందని వ్యాఖ్యానాలు
అంతుచిక్కని తాత్పర్యాలు
డొల్లతనాల మినహాయింపులు
డోలువాయించే జరిమానాలు ....
బండమీద గీతల శాసనీయమైనవి కొన్నైతే
డబ్బు దస్కం ఆర్ధిక పాలనలను
అందిపుచ్చుకోవడానికి సుందరమైనవి మరికొన్ని ...
ఎక్కాల పుస్తకములోని గుణింతాలలా
వందల ఆర్టికల్లు.. ఎనిమిది షెడ్యూళ్లు
అనేక సవరింపుల సన్నాయి నొక్కులు ...
వాడవాడలా వకాలతులపెద్దమనుషులు
పల్లె పల్లెకో సామంతుల్లాంటి పాలనాదక్షుడు
నియోజకవర్గాల నిఖారసులు
రాష్ట్రాలకు వేరుగా...కేంద్రానికి వేరుగా ...
ప్రజలందరికి పప్పన్నం పెట్టే రైతులా
పైవారందరిని పట్టుబట్టి పోషించేది
ఆ సగటు పౌరుడైనా సరే .....
పద్మవ్యూహం లాంటి పథకం లాగా
అసలు విషయం అర్థం కానీయని
గ్రంథరాజములు రాజ్యాంగము మరియు
రకరకాల చట్టాల చిట్టాలు .... చివరకు
ఆయన ఉనికినే ప్రశ్నిస్తున్న ప్రస్తానం ...
ఉట్టిమీద పెట్టిన దుత్తలా
ఊరికే విద్యనందనీయరు ...
ఏడుకొండలవాడి సుప్రభాత సేవలా
ప్రజలకు వైద్యమందనీయరు...
నీకూ నాకూ మధ్యన నిలిచిన
(పాలకులకు .... ప్రజలకు )
అగాథాన్ని నియమ నిష్టలతో
నీతి న్యాయాలతో నిక్కచ్చి ధర్మాలతో
పూడ్చడానికి ప్రయత్నించేది ఎవరని
అర్థం కాక ఎదురుచూపులతోనే
ఎంతోమంది అభాగ్యుల జీవితాలు
అగాథాల పాలు అవుతూనే ఉన్నాయి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment