Wednesday, May 10, 2023

అమెరికా బ్రతుకులు

 అమెరికా  బ్రతుకులు 

అందమైన పెద్ద పొదరిల్లులు 

సుందరమైన విశాల రహదార్లు 
అయినా అందని ఆనందాలు 
కష్ట సుఖాలు కలిసి పంచుకోలేక .... 

ఉద్దెర పొద్దు లేకుండా బతకాలని
ఇద్దరేసి ఉద్యాగాలతో అలరారుతూ
కడుపుతీపైన కన్నోల్లను డేకేర్లకు … 
అల్లారుముద్దుల ఆరాటాలు  తీరకుండా… 

చంటోడికి చడ్డీ ఇప్పదీయకున్నా 
విశ్వాసమైన జంతువని కాబోలు ... 
కుక్క విసర్జనాలను ఎప్పటికప్పుడు 
కుందనమైన కవర్లో ఎత్తుకుంటూ
భద్రంగా డబ్బాలలో వేస్తుంటారు
నడకలలో .... 

ఉద్యానవనపు చెట్టు చేమలనో
లేదంటే గుట్ట బోర్ల లోయలనో…కాదంటే 
సముద్రతీరాలనో వెదుక్కుంటారు…
కన్నవారు బంధు మిత్రులకు దూరంగా
ఆనందాల చిరునామాల ఆనవాళ్ళకై… 

ఎక్కితే కారు దిగితే కారు… అయినా
తిక్క తిరుగుతుంది ప్రతి పనికి ఒక్కొక్కసారి… 
ఇల్లంతా పీకేసిన ఇంటి పనులతో
పందిరేసుకునే పిల్లల పనులతో బొక్క బోర్లానే … 

పనిరాక్షసితో ఐదురోజులు కుస్తీలు 
పకడ్బందీగా పిల్లలకు రోజువారి క్లాసులు
పయిలాయిస్తున్న యాంత్రికతతో 
పరేషానే ఆత్మీయతలు కరువై నిత్య జీవనంలో… 


చలిపులికి భయపడి బిగదీసుకున్నా
పుచ్చపువ్వులా ఎండ కాసినా పండగే 
మల్లెపువ్వులా మంచు కురిసినా సందడే
చరవాణిలో ఛాయాచిత్రమై బంధించుడే… 
బంధుమిత్రులకు చూప బతుకు సంతోషాలను. 

బహుగొప్పవైన వాణిజ్యకూడళ్ళు 
వారెవ్వా అనే పార్కింగులు 
కానీ క్షణంలో చేరలేని దూరాలు 
కాలినడకలకు కానరాని రక్షణలు ... 

No comments:

Post a Comment