Wednesday, May 10, 2023

అనాది కాలపు చూపులు తేది : 03-11-2022 శీర్షిక : ఎదురు చూపులు

 అనాది కాలపు చూపులు

తేది : 03-11-2022
శీర్షిక :  ఎదురు చూపులు 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ఆ చూపులకు చత్వారమొచ్చింది… 
వంతుల వారీగా గణాలు మారుతున్నారు... కానీ 
మనసు బండరాయిలా కరుగుతలేదు ... 
వాళ్లంటే వీళ్ళనీ ... వీళ్లంటే వాళ్ళనీ ... 
అధికారపక్షం ... ప్రతిపక్షం ... 
రాష్ట్రమంటే ... కేంద్రం .... 

అతివృష్టికి పొలాలన్నీ తటాకాలైనా 
అనావృష్టికి నిర్జలీకరణమై నెర్రెలూనినా 
అకాలవృష్టికి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలా 
నిశ్చేష్టతలై  నిలువునా దహించుకపోయినా  ... 
జవసత్వాలు కూడగట్టుకుని పూనుకుంటున్నాడు ... 

పురిట్లో సంధిలా విత్తనాలతో విసిగిపోయిన 
నకిలీ రసాయనాల రందితో విలవిలలాడినా 
కొసిరి కొసిరి వెంటపడి పంట పండిస్తున్నడు 
కొన ఊపిరితోనే నిలదొక్కుకుంటున్నడు ...

ఒక్క టర్మ్ లో కోట్లు సంపాదించే 
నాయకుడు కాలేకపోయినా ... 
తాకట్టు లేకుండా అప్పు సంపాదించే 
వ్యాపారవేత్త కాకున్నా ... 
బాధ్యత భుజాన వేసుకున్న భారతీయుడిలా 
గొప్పలు చెప్పుకునే పాలకుల కాకి లెక్కల్లో 
తప్పులు దొర్లనీయకుండా .. పొర్లుదండాలు 
పెట్టయినా పంటల లెక్క సరి చేస్తున్నరు .. 

దేవుళ్ళకు భక్తుల్లా నాయకులకు 
మద్దతుధరకై మొరపెట్టుకున్నా ....  
వళ్ళు పట్టని బండరాయిలా 
వంతులవారీగా చింత తెలుపుతున్నరు 
కాదనరు .. లేదనరు.. పని జరగదు .. 
అంతా ఒక జగన్నాటకం ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment