Wednesday, May 10, 2023

చలి పులి హాస్య కవిత తేది : 22-11-22 శీర్షిక : కాలపురుషుడు గురువై ...

 చలి పులి  హాస్య కవిత

తేది : 22-11-22
శీర్షిక : కాలపురుషుడు గురువై ... 

ఎప్పుడూ ఒకటే కక్ష్యలో తిరగడమేనా అని   
అవని మాతకు విసుగు పుడుతుందో 
ఏమో ... ఆయనాలు మార్చుకుని అలిగి 
అప్పుడప్పుడు సూర్యునికి ఒకింత 
దూరంగా జరుగుతుందేమో  ....లేదా  

కనికరం లేని స్వార్థ పాలకుల 
అత్యాశల కరంటు బిల్లులు వరుసగా 
కట్టలేరు ప్రజలు పాపమని..కాలపురుషుడు 
జాలి కరుణలు చూపి ఆదుకోవడానికేమో....  

అంతే ఇక ! చలి పులి దిగ్గున లేచి జూలు 
విదిల్చి ప్రజలందరినీ పలకరిస్తూ భయ 
భక్తులు నేర్పిస్తుంది ... చక్కగా ముస్తాబై 
ముసుగులేసుకుని మూలన కూర్చొమ్మని 
హెచ్చరికలు జారీ చేస్తుంది ! ముఖ్యంగా 
ముసలివాళ్లను .... 

మనుషులంతా ఇక వినయ విధేయతల 
దూతలై ...విపరీతమైన అణకువలతో  
చేతులు కట్టుకుని చక్కదనం ఒలకబోస్తూ  
తలలో నాలుకలై తమాయించుకుంటారు ... 

శరదృతువు చమత్కారములతో  
కాలచక్రం  చలి పులిని ఉసిగొలిపినా 
చక్కదనమే శశి ప్రకాశాల శీతలాలు 
కొత్తదంపతులను పలకరించడంలో ... 
  
మంటలేసుకుని ఒళ్ళు కాగుతూ 
జనం గంటలతరబడి పిచ్చాపాటి 
ముచ్చటలకు మూతులు చాపేస్తూ 
ఉచిత సమాచార మార్పిడికి ఊతమిస్తారు .... 

పెత్రమాసకు పెసరిగింజంతగా వచ్చి చేరి.. 
శరన్నవరాత్రులతో అమ్మను కొలిపించి 
కార్తీకమంతా జప తపాలు చేయించి ... 
అయ్యలను తలపించి ఆదుకుంటుంది ...

సంక్రాంతికి చంకలు లేవనీయకుండా చేసి...
చెంబెడు నీళ్లకే గంపెడు కోరికలు తీర్చే శివుణ్ణి 
తలిచే శివరాత్రి వరకు..  శివ శివా అంటూ 
దులిపేసుకుని పోయినా సరే  ... 

సూక్ష్మ క్రిముల బాధలనుండి సుందరంగా 
మనమంతా తేరుకోవాలని శుచి శుభ్రతలు నేర్పించి... 
ఏకభుక్తం సర్వశ్రేష్ఠం అంటూ ఆధ్యాత్మిక శోభలతో 
పండుగలన్నీ మనతో చేయించేస్తుంది ...గురువై 
మనకు నేర్పి ... సంస్కృతికి పట్టం కడుతుంది ...    
 
ఇక ...ఈ సమయంలోనే హిమాలయాలన్నీ 
మంచు చీర చుట్టుకుని మల్లెపూలు తురుముకుని  
ఆది దంపతులను పలకరించి సుందర 
శోభలతో నయనానందం చేస్తుంటాయి ....  

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

No comments:

Post a Comment