ప్రేమ గీతాలు
తేది : 05-11-2022
శీర్షిక : ఇదేనేమో ....
ప్రేమంటే ఇదేనేమో
ఇలాగే ఉంటుందేమో ...
మదిలోనే పదిలమై
మననంతో ఘనమవుతూ...
ఆలోచనలల్లుకుని
కులుకు పలకరిస్తుందా ...
పిలుపులకు పలకలేని
పరధ్యానం ఆవరించి ....
పెన్నిధిలా పెనవేసుకుని
సన్నిధిలా తోడుంటుందా ...
ప్రేమంటే ఇదేనేమో
ఇలాగే ఉంటుందేమో ...
మనసంతా నిండుకుని
పరవశాల పులకరింపులు ...
హృదయమంత ఆవరించి
హరివిల్లుగ తోస్తుందా....
మెలకువలో కలవరిస్తూ
కలలోన విహరిస్తానా ....
నన్ను నేను మరిచిపోయి
మయూరాన్ని అవుతానా...
ప్రేమంటే ఇదేనేమో
ఇలాగే ఉంటుందేమో ...
అద్దంలో చూసుకుని
నాకు నేను మురుస్తానా ....
ఎవరెవరినో పిలిచినా
కోయిలలా పలుకుతానా ....
మనసంతా విచ్చుకుని
విరిసే పువ్వై తోస్తుందా ...
హృదయమంతా పరుచుకుని
గువ్వలా ఎగురుతానా ....
ప్రేమంటే ఇదేనేమో
ఇలాగే ఉంటుందేమో ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment