వీడని దృశ్యాలు
తేది : 21-11-2022
శీర్షిక : పల్లె తల్లి ఒడి ...
ఉదయాత్పూర్వమే పిచ్చుకల
కువకువల పిలుపులతో లేచిపోయి
పచ్చ తివాచీలుగా పరుచుకున్న
పొలం గట్లమీదుగా నడిచి వచ్చిన
బంగారు బాల్యపు అడుగుజాడలు ....
పచ్చలు పొదిగిన పల్లె తల్లి నీడన
పరంధాముడు ప్రేమగా పెంచిన
పశు సంపదల మధ్య తచ్చాడిన
పసందైన మరువలేని ఘడియల
మధుర తెరలు కళ్ళముందు కదలాడడం...
భూపాళరాగం వేళ అల్లంత దూరాన
ఆలయంలో లీలగా వినిపిస్తున్న సుప్రభాత
రాగ సుధల వేళ సుందరమైన బూడిద రంగు
ఆకాశంలో పరుచుకున్న భూరి సంపదల
సప్తవర్ణాల శింగిడి జాడలు ....
ఆవురావురుమంటూ ఆలమందలన్నీ
చేలవైపుగా చెంగు చెంగున దూసుకెళ్తుంటే
తోలుతూ....అల్లన పాడే పిల్లనగ్రోవిని మోగించే
గొల్ల బాలుని నోటంట వెలువడ్డ రాగాలు ...
వడివడిగా అడుగులేస్తూ ఇల్లుచేరి
పిల్లలకు పాలందించాలనే అమ్మ పశువుల
పరుగులాంటి నడకల ఆరాటాలతో
మారుతమైయ్యే గోధూళి మలి సంధ్యలు.....
పాపపుణ్యాలు పక్కనపెట్టి లేగదూడను
కట్టేసి సరిదంటగా సగం సగం పంచుకుని
గోమాత పాలు కొసిరి కొసిరి పితుక్కున్న
తప్పని రైతుల తిప్పల దృశ్యాలు ....
ప్రాథమిక విద్య అయిపోగానే ....
పట్టింపులులేని ప్రభుత్వాల పా లనలలో
పడి పడి సోపతులతో పక్కూరు పయనంలో
వెలగబెట్టిన బాల్య పరాక్రమాల తోరణాలు ...
అప్పుడప్పుడే అజ్ఞాన తిమిరాలను
పారదోలుతూ
జ్ఞాన వెలుగుల తొడుగులలో
ప్రకాశిస్తూ పల్లెతల్లి ఒడిలో సిసింద్రీగా
చిందులేసి సేదదీరిన సుందర సుమధురాలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment