Wednesday, May 10, 2023

జైలు బడి తేదీ : 07-11-2022 శీర్షిక : మానవాళి మహావృక్షానికి చెదలు

  జైలు బడి

తేదీ : 07-11-2022
శీర్షిక : మానవాళి మహావృక్షానికి చెదలు 
సంఖ్య : సహస్రాధికం 

మనిషి తాడిచెట్టును మించి 
పోతున్నానని సంబరపడిపోతూ 
వివేకాన్ని వివేచనను దులిపేసుకుని
కృత్రిమ మేదస్సుల పనికి ఖుషీ పడి
మరమనిషికి దాసోహం అవుతున్నాను
అనే కనీస స్పృహను కోల్పోతున్నాడు .... 

కుసుమ కోమలంగా మేధస్సును 
వికసింపజేసే బోధనలే పరమావధిగా 
పచ్చని చెట్లమధ్య ప్రశాంత 
వాతావరణంలో పర్ణశాలలై
కొలువుదీరిన రోజులనుండి ... 

అడుగులో అడుగు వేసి 
పల్లెకో ముల్లెలా ఒక్కొక్క బడి... 
పట్నానికో కళాశాలగా...రాజధానికో 
విశ్వవిద్యాలయంగా మెల్లమెల్లగా  
చేరుకుంది ..పాశ్చాత్య పోకడలతో ... 
పారిశ్రామికీకరణల అడుగులతో .... 

సద్బుద్ధుల సన్మార్గాలనందించే విద్య ... 
సంఘ సంక్షేమం..సద్భావనల  వైద్యం...  
ఇంకా కొన్ని మౌళిక సదుపాయాలూ...
ప్రభుత్వ కనుసన్నల్లో పయనిస్తుంటే
ప్రజలు సేద దీరాల్సింది పోయి ...

ప్రైవేటు పరానికి వరాలుగా దారాదత్తం 
చేస్తున్నారు...చేతకాకనో ... చేవలేకనో .. 
పాపాలకో ... రూకలకో ... ప్రశ్నించడానికి 
ప్రజలంతా ఒకటి కాలేరన్న ధీమాతోనో ....
అయినా చట్టాలన్ని తమ చుట్టాలేననో… 

చాపకింద నీరులా సమాజం మెల్లిగా  
సాంకేతికతల చంకలో దూరిపోతుంటే  
పోటీపరీక్షలకే పోటీలు పడిపోతూ 
పద్దెనిమిది గంటల ప్రయాసలతో 
పిల్లల తాటలు తీసేస్తున్నారు .... 

ఇంకా చాలదన్నట్టు ఏ సి బడులు 
పెట్టేసి ఐ ఐ టి లకంటూ బిట్స్ 
ఫిలానీలంటూ ... పేర్లు మార్చేస్తూ 
తరగతుల సూచీలు మారుస్తూనే... 
పిల్లలను... తల్లిదండ్రులను చిత్ర 
హింసలకు గురిచేస్తున్నారు ...   

విజ్ఞుల మౌనమెప్పుడు విపరీతాలకు 
దారి తీస్తుందన్నట్టు ....అంతటా 
యాంత్రికతలు నిండిపోయి...పిల్లలు పెద్దల్లో ... 
ఆత్మీయత .. అనురాగం అడుగంటిపోయి ... 
మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలైపోతూ... 
అసలుకే మోసమై .... మానవాళి 
మహావృక్షమును  చెదలు తినేస్తున్నది .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment