రవివారం రాగ కణిక
కుటుంబం - విలువలుతేది : 20-11-2022
మూలమేమిటో గుర్తెరగరా
భావమేమిటో బోధపడునురా ...
రామచంద్రుని వాక్కులు
రసమయమైన చమక్కులు
యుగాలనాటి బోధనలే
శిరసా నమామి మనకు ...
కట్టూ బొట్టూలు కనికట్టే
కాలానికి నిలిచిన పనిముట్టు
చెక్కుచెదరని సంస్కృతులే
బొక్కబోర్లా పడనీయవులే ...
మూలమేమిటో గుర్తెరగరా
భావమేమిటో బోధపడునురా...
బాల్యంలో అమ్మబోధనలు
బాధ్యతలో నాన్న మాటలు
బహుగొప్పగ తీర్చిదిద్దును
బతుకుబాటలు దర్శనమౌను ...
అనురాగాల తోబుట్టువులు
అశువుగ నేర్చిన ప్రమాణాలు
విలువల వలువలు జోడించి
రాటుదేల్చును రమణీయంగా ...
మూలమేమిటో గుర్తెరగరా
భావమేమిటో బోధపడునురా...
మనసెరిగిన సహచరితో
మల్లెపరిమళం జీవితం
మాటలు వింటే కన్నపిల్లలు
మరువ ధవనం కాంతులే ...
అవిభాజ్యాల ఆనాటితరం
పుట్టతేనెల పట్టుమధురం
పట్టుకలిగితే జట్టు సుందరం
క్రమశిక్షణలకు కార్యాలయం ...
మూలమేమిటో గుర్తెరగరా
భావమేమిటో బోధపడునురా...
ధైర్య సాహసాలకు పుట్టినిల్లై
దయాగుణాలకు నిలయమై
నీతి నిజాయితీలకు వనమై
ఆధ్యాత్మికతల శోభ నింపును…
విలువలెరిగితే కుటుంబం
నిలువరించదా అరిష్టం
దశ దిశలు చూపించంగ
దేశానికి నిలుచు వెన్నెముకగ
మూలమేమిటో గుర్తెరగరా
భావమేమిటో బోధపడునురా...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment