Wednesday, May 10, 2023

గోదావరి తేది : 31-10-22 శీర్షిక : జీవనది ...

 గోదావరి 

తేది : 31-10-22
శీర్షిక : జీవనది ... 

పశ్చిమ కనుమల్లో పురుడు పోసుకుని 
దక్షిణ గంగగా ప్రాచుర్యం పొందినది ... 
త్రయంబకం బ్రహ్మగిరి జన్మస్థానం 
మా తల్లి గోదావరి బహు పుణ్య నదము 

నాసిక్ పైథాన్ నాందేడుల మీదుగా 
నగారా మోగిస్తూ మరాఠాలో బైలెల్లి 
పెనుగంగ వైన్ గంగలను కలుపుకుని 
మలివిడత అడుగిడె తెలంగాణలో .... 

మంజీరా మానేరు పెద్దవాగులతో 
మాగాణులు కలియతిరిగి పదిలంగా 
ప్రవహిస్తూ ... సిరిసంపదలందించు 
తెలంగాణ రైతన్నలకు .... 

బాసరలో  శారదాంబ పాదమంటి 
దక్షిణదిశ పయనంతో ప్రశస్తమందె ... 
దండిగా ధర్మపురి నారసింహుణ్ణి 
దర్శిస్తే ...యమపురి కేగరనే నానుడితో ....  

నాటి శాతవాహనుల కోటిలింగాల 
ఈశ్వర సాన్నిధ్యం నుండి మంథని 
గౌతమేశ్వరున్ని కలుపుకుని... 
జ్యోతిర్లింగమయిన ఆది భిక్షువు 
ముక్తేశ్వరున్ని కాళేశ్వరంలో పలకరించి 
ప్రాణహిత సంగమంతో త్రివేణిగా 
అవతరించె... 

సీతారామ లక్ష్మణ హన్మత్ సమేతమై 
భద్రగిరిన కొలువైన కళ్యాణ రామున్ని 
కమనీయంగా నిలుపుకుని ... 
ప్రకృతికే వన్నెలద్దుతూ పాపికొండల్లో 
ప్రవేశించినది .... 

పట్టిసీమ మొదలుకుని కోనసీమ దాటుకుని 
అంతర్వేది వరకు పలు ప్రసిద్ధమైన 
ఆలయాలకు ఆలవాలమై అచ్చంగా మూడు 
పాయలై అందమైన డెల్టాగా అమిరింది .... 

చిరు చీకటిలో కాంతిరేఖలా ... 900 పైచిలుకు 
చిన్నా పెద్ద డాములతో ... త్రాగునీరు ... 
పంటనీరందిస్తూ ఆరు రాష్ట్రాల అన్నదాతలకు 
ఆదరువై ..కన్నతల్లియై జీవనదిగా ఆదరిస్తుంది .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment