Wednesday, May 10, 2023

ఆనందాల హరివిల్లు తేది : 17-11-22 శీర్షిక : సప్తవర్ణాలు

 ఆనందాల హరివిల్లు

తేది : 17-11-22
శీర్షిక :  సప్తవర్ణాలు 
కవిత సంఖ్య : సహస్రాధికం 

పచ్చలు పొదిగిన పల్లె తల్లి ఒడి...  
పలకరింపుల్లోనే బంధుత్వాలతో 
పట్టం కట్టిన ఇరుగు పొరుగులు .... 
అరమరికలు ఎరగని ఆనందాల బాల్యం...  

ఆత్మీయత పాదుల అమ్మానాన్నలు 
అమృతతుల్యాల ఆలనాపాలనలు 
అడగకముందే తీరిపోయిన అవసరాలు 
అనురాగాలు కుమ్మరించు తోబుట్టువులు .... 

నిలిచిన ప్రతిచోటా గెలుపు శిఖరం 
పలకరింపులు...గెలిచిన ప్రతి 
మలుపులో అభినందనలతో జంట 
కట్టిన అదనపు బాధ్యతల బరువులు  ... 
ఎదిగినా తరువులా ఒదిగి నిలవగలగడం ... 

అడుగడుగున నీరాజనాలు వర్షించిన  
మాతృసంస్థ ... తక్షణ అవసరాలను  
తదనుగుణంగా తీర్చుతూనే ... 
భవిష్యత్తుకు కూడా బాటలు వేసిన 
బంగారు వన్నెల వెలుగుల సంస్థ .... 

మనసెరిగి మసులుకునే సహచరి 
మాటలను ఆజ్ఞలుగా శిరసావహించే పిల్లలు ... 
సమయానుకూలంగా సంబరాలు పంచిన 
అధికార హోదాల నందనాలు...అదనంగా 
ఆహ్లాదం పెంపొందించే  ఆధ్యాత్మికతల 
ప్రాంగణాలు ...  

నాలుగు దశాబ్దాలు నల్లేరుపై నడకలా 
సాగిన ఉద్యోగ ప్రస్థానాల పయనం .... 
అన్నీ కలిసి అమృతప్రాయాలైన  
ఆనందాల హరివిల్లుల  జీవితాన   ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment