కణిక
నేటి బాలలు-నాటి బాలలు.
తేది : 14-11-22
శీర్షిక :
నాడు…
అమ్మానాన్నలకైనా ఆచార్యులకైనా..భయం
భక్తుల కలబోతల వ్యక్తిత్వాలు..నాటి బాలలు
బంటోలే కష్టపడి రాజులా ఎదిగిన తరం
బాధ్యతల బందీలలో పెరిగిన క్రమం ….
ముల్లె విప్పిన పల్లె పరిమళాలతో
ముచ్చటగొలిపే వినయ వినమ్రతలు..
బంధాల అనుబంధాల పూరెమ్మలు
నిష్కల్మష నిర్మలత్వాల మచ్చుతునకలు …
కష్టం విలువలు తెలుసుకుని
కాసులకు విలువలిచ్చి కదిలినతరం
పరుగెత్తి పాలు తాగిన దానికన్నా
నిలకడగా నిదానమైనా నీళ్లు మేలన్నవాళ్ళు..
నేడు…
పారిశ్రామిక ప్రగతులో పట్టణీకరణలో
ఉరుకుల పరుగుల జీవితాలు …
పక్కింటివారితో కూడా పరిచయమెరుగని
ఉలుకు పలుకు లేని నిస్సారపు బతుకులు …
కాలుష్యాల కబంధ హస్తాలలో
మానవతలకు మైళ్ళ దూరాన
కాళ్ళు కందకుండా కష్టం తెలువకుండా
సహజాలకు విరుద్ధముగా పెరుగుతున్నారు…
సాంకేతికతల కనుసన్నల్లో దూరవాణి
తెరలవాణి చరవాణి చూపుల్లో
కుప్ప మీదచ్చే తెప్పలాటల్లో మునిగి
తగ్గిన దృష్టి క్షేత్రాలతో తల్లడిల్లుతున్న తరం…
నేటి బాలలే రేపటి పౌరులు కద..
దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులు..
మానవత్వాలను అద్ది ఆత్మీయ లతల
మల్లెసుగంధాల పరిమళాలు దిద్దితేనే
రేపటితరం బాగుంటుంది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment