గ్రహణం ...
శీర్షిక: క్రమశిక్షణ ఎరిగిన శిష్యులే ...
తేదీ - 25-10-2022
అనుపానులెరుగని అంబరాన
అంతా చిత్ర విచిత్రాల సమ్మేళనమే ....
అగ్నిగోళాల క్రమశిక్షణల కక్ష్ యలతో
అవతరించాయి అనేక పాలపుంతలు .....
సూర్య చంద్రులు ఆదిగాగల
గ్రహాలూ ఉపగ్రహాలు తోకచుక్కలు
ఆస్టరాయిడ్లు ఉల్కల సమ్మేళనాల
సముద్భవాలే....నక్షత్ర మండల
పాలపుంతలు....అనేక పాలపుంతల
సమ్మేళితమే అనంత విశ్వం.....
లెక్కల మాష్టారు ప్రియతమ
క్రమశిక్షణలు ఎరిగిన శిష్యులే
లెక్క తప్పకుండా చేసే భ్రమణ
పరిభ్రమణాల గ్రహ పరివారం ...
అయినా అప్పుడప్పుడు అప్పు
తచ్చుల్లా ఒకరి నీడ ఒకరిమీదై
సూర్య గ్రహణం చంద్ర గ్రహణం
పందెమేసుకుంటాయి మనకు
భ్రమగా ...
గ్రహాల గమనశీలతలో
భ్రమణ పరిభ్రమణాలతో
ఏర్పడే చీకటి వెలుగుల
చిక్కుముడుల చిత్రాలే అన్నీను ....
కాలం గుండా ప్రసరించి వచ్చే
కాంతిరేఖల్లోని మార్పునే
గ్రహణంగా కనిపెట్టిన మన
పూర్వీకులకు వందనం ....
మనిషి జీవితంలో కూడా
అప్పుడప్పుడు సంభవించే
చిన్న చిన్న అనర్థాలను గ్రహణంగా
సంభోదించుకుని సవరించుకుంటారు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment