Wednesday, May 10, 2023

జీవన యాత్ర తేది : 31-10-2022 శీర్షిక : స్వర్గతుల్యమే....

 జీవన యాత్ర 

తేది : 31-10-2022
శీర్షిక : స్వర్గతుల్యమే.... 

జీవరాశిలో మిన్నయినా 
భావరాశిలో మిన్నయితేనే 
జనన మరణాల మర్మం తెలియకున్నా  
ప్రకృతి నీతి సూత్రాల పదిలపరుస్తూ
మన చేతిలో ఉన్న మహాత్యమైన జీవితంతో..
మణిమయమైన నగారా మోగించొచ్చు  ... 

పవిత్ర ఓషధులను మూటగట్టుకునే
స్వచ్ఛ నీటి సెలయేళ్ళ తావిలా... 
ధర్మాన్ని దర్శించి...నీతి నియమం 
పాటించి...క్రమశిక్షణలను పొదువుకుని...
న్యాయాన్ని నెత్తికెత్తుకుంటే ...  
కాలమార్పులలో కాంతిరేఖలమై రశ్మించవచ్చు. 

లేదా ...
కాళరాత్రులలో కళావిహీనంలా 
వికటాట్టహాసపు వింత  కాలుష్యాలను
మూట కట్టుకునే మురికి కాలువలా... 
అధర్మం ఆసరాగా... అవినీతి చిరునామై ...    
అన్యాయపు అంగీ తొడుక్కుంటే.... 
అదఃపాతాలం అంచులు చేరుకోవచ్చు. 

ఏదైనా సరే… కదిలి కదిలి జలనిధి 
కడలి చేరిన చందంగా...మనిషి 
కూడా జీవనయాత్రలో పునీతమై...
విల్లమునుండి విడుదలైన 
మంత్రించిన శరములా...ప్రాణం కూడా 
ప్రారంభపు చోటుకు చేరాల్సిందే ..... 

పరోపకారం ఇదంశరీరంలా 
శిశిరంలో తలలు దులుపుకున్న 
తరువులు సైతం వసంతంలో 
చిగురిస్తూ జీవరాశి మేలు కోరు .... 

విజ్ఞానాల వింతజీవిననే హక్కును
దఖలుపరుచుకునే ముందు ...  
ప్రకృతి నీతి సూత్రాల పందిరిలో 
మనిషి కళ్ళు తెరుచుకోవాలి. 

జీవ ధర్మాలను జీర్ణించుకుని ... 
అనుభవాల పుటలను అవపోషించాక 
ఫలితామాశించని పరమాత్మ విధిగా
జీవన యాత్రను...సత్కర్మల 
సిరిసంపదలతో నింపితే 
సమాజమంతా స్వర్గతుల్యం కాదా ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment