Wednesday, May 10, 2023

ఆనందాల హరివిల్లు(2) తేది : 17-11-22 శీర్షిక : సప్తవర్ణ సరాగములే...

 ఆనందాల హరివిల్లు

తేది : 17-11-22
శీర్షిక :  సప్తవర్ణ సరాగములే... 


చెట్లనావరించిన పిట్టలన్నీ గూళ్ళు వదిలి 
రాగశోభితమైన కువకువల సయ్యాటల
సమయాన...భూపాలరాగం వేళలో భువిని స్పర్శించ 
ఏతెంచిన బాల భానుడు చుట్టూ పరుచుకున్న 
వర్ణరంజిత మేఘమాలల దృశ్యాలు ... 

పచ్చలు పొదిగిన పల్లె తల్లి ఒడిలో 
పెందలాడనే గోమాత పొదుగును 
గోముగా ఒడిసిపట్టి ...  అమ్మ ప్రేమను 
ఆస్వాదించే లేగదూడల సుమధురమైన 
అంబారవముల ఆనందాలు .... 

అల్లంత దూరాన ఆలయంనుండి 
ఆధ్యాత్మిక ధూపంలా గాలిలో ఈలగా 
లీలగా వినిపిస్తున్న సుమధుర సుందరాల  
వీనుల విందైన సుప్రభాత రాగాలాపన .... 

బండ్లబాటలకిరువైపులా మంచుముత్యాలు 
సంతరించుకుని తలలూపుతున్న గడ్డిపూలకు 
ఆవల... పచ్చ తివాచీలై  పరుచుకున్న చేనుల 
పసందైన పనోరమా దృశ్యాలు .... గుండె గూటికి 
పంచే  సరాగాలు ... 

కోనలన్నీ దాటుకుని కొండ రాళ్ళనుండి 
కోయిలమ్మ పాటలా సవ్వడి చేస్తూ 
పయనిస్తున్న నిష్కల్మష నిగ్గుల 
సెలయేటి నీటి సుందర దృశ్యం .... 

నట్టింట నడయాడే  బోసినవ్వుల 
పాపాయిల చిరునవ్వుల కానుకల్లో 
చిట్టి ముత్యాలు దొర్లిపోతూంటే  
చిత్రించుకునే అపూర్వ చిత్రాలు ... 
అన్నీ సప్తవర్ణ సరాగములే  .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment