Wednesday, May 10, 2023

కవన రవళి - చలి పులి తేది : 22-11-22

 కవన రవళి - 

చలి పులి  
తేది : 22-11-22

పెత్రమాసకు పెసరిగింజంతగా 
పయనమై ..శివరాత్రి వరకు శివ 
శివా అంటూ దులిపేసుకునే 
కాలమానపు మార్పుల కథాకళి...  

మనుషులంతా విధేయతల 
దూతలై ... అణకువగా చేతులు 
కట్టుకుని చమత్కారాలు చేస్తూ 
తలలో నాలుకలై తమాయించుకుంటారు ... 

ఉదయాతపూర్వపు మంచు తెరలు 
ఉషోదయపు ఉదయ కాంతిలో   
ఉర్విపై పచ్చ తివాచీ పరకల చివరన 
ఉప్పొంగిన మంచి ముత్యాలను బోలు .... 

ఆధ్యాత్మికతకు ఆనవాళ్లయి
హరిహరులను పూజిస్తూ 
కార్తీకమంతా కదలాడగానే 
మారుమోగే ఆలయాలన్నీ .... 

శరదృతువు చమత్కారములతో  
కార్తీక మార్గశీర్షములు కళకళలే .... 
చలి పులిని ఉసిగొలిపినా 
చక్కదనమే శశి ప్రకాశాల శీతలాలు .... 

శరణు శరణు అంటూ అయ్యప్ప 
మాలాధారణలు, దీక్షలతో, పడిపూజలతో , 
మండల దీక్షలతో భజనలతో 
దేవళములన్నీ  శోభాయమానమే ... 

ఆయనం మార్పులతో ఉత్తరార్థ 
భూగోళమంతా ఉష్ణాలు తగ్గి 
మంచుతో కప్పబడి హిమపాతముల 
బెడదలతో బిక్కు బిక్కు మంటుంది  .... 

తరిగిన భాను సమయాలు 
పెరిగిన నిశి అవధులు 
మిలమిలల వెలుగులు విరజిమ్మి 
మెరిసే నక్షత్రాలతో పోటీ పడే 
జ్వాలా తోరణాలు ...శోభాయమానమే .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment