Tuesday, March 7, 2023

నాయనమ్మ జ్ఞాపకం తేది : 28-10-2022 శీర్షిక : నాయనమ్మ

 నాయనమ్మ  జ్ఞాపకం 

తేది : 28-10-2022
శీర్షిక : నాయనమ్మ 
కవిత సంఖ్య : సహస్రాధికం 

నేను పుట్టకముందే తాతగారు కాలం చేస్తే ... 
పూర్తి జ్ఞానమొచ్చేవరకు చూసింది నానమ్మనే ...  
అయినా అడుగడుగున ఆమె ప్రేమ 
జ్ఞాపకాల నెమిలీకలు తల నిమురుతాయి  ... 

అరవకష్టంతో  ఆకలెల్లదీసిన అనుభవశాలి...
కష్టం చేసిన గట్టి శరీరపు ఛాయలు  ...  
బండమీద గింజలు పుట్టించుకుని 
బతికి తిన్న దాఖాలాలేమో ... 

ఆరుగురు పిల్లలకు అమ్మగారు ... 
ఆత్మీయతలు కురిపించే అమృతభాండం ... 
మనుమలు మనుమరాండ్రన్న 
మమతల మల్లెలై అల్లుకునేది ... 

కష్ట సుఖాలను కాచి వడబోసిందాయె ... 
కళ్ళల్లోని భావాలను చదివేసేది ... 
మాట తీరు చూసి మనసు పసిగట్టేది ... 
అడగకముందే మన ఆకలి గ్రహించేది .... 

చదివింది కానిబడి రెండో తరగతైనా 
చదివించింది పైచదువులు ఇంటిళ్లిపాదిని.. 
లెక్కల్లో తప్పు చేస్తే డొక్క చీల్చినంత 
పని చేసేది ...వంటింట్లో పనిమీదున్నా 
ఎక్కాలల్లో తప్పులను దొరక పుచ్చుకునేది... 

అల్లిపూల జీవితమేమి కాదు 
అయినా ఆనందాలు పంచే తత్వం... 
అమ్మెప్పుడయినా మాపై  కోపగిస్తే 
నాయనమ్మ కొంగులో దూరిపోయేవారం. 

బంధు మిత్రులందరిని బంగారమోలే 
చూసుకునేది... బంధుత్వాలకు వారధిగా 
అందరిని కలుపుగోలుగా పలకరించేది ...  
ఆపదలొస్తే తమపర భేదమెరుగక పోయేది ... 

సుఖ దుఃఖాలను అనుభవించిన  
సుందర వ్యక్తిత్వం...కాదు లేదనకుండ 
కష్టాలలో ఉన్న పొరుగులకు 
కాసింతనైనా సాయం చేసే తత్వం ... 

అమ్మా నాన్న పెద్దమ్మలు పెదనాన్నలు 
ఎవ్వరైనా సరే ఎదురు చెప్పే వారు కాదు ... 
నిర్ణయాలు అంత నిష్పక్షపాతంగా 
నిఖార్సుగా ప్రశ్నించలేనివిగా ఉండేవి ... 

న్యాయశాస్త్రం చదవలేదు కానీ 
నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం ... 
సమకాలీన సమాజ స్థితిగతులను 
సంయమనంతో అవపోశన పట్టేది ...

కంటికి రెప్పలా మమ్మల్ని కాచుకునేది ... 
తప్పులేకుండా మమ్మల్ని బయట ఎవరైనా 
తిప్పలు పెడుతున్నారంటే ఆడ పులిలా 
అడ్డు నిలిచేది...శివంగిలా చిత్తు చేసేది  .... 

No comments:

Post a Comment