నా హృదయం ఓ గడియారం
తేది : 19-10-2022
శీర్షిక : మానస ప్రతినిధి
సంఖ్య : సహస్రాధికం
లోహ నిర్మితమై ముళ్ల
చక్రపరిభ్రమణాలకు
ప్రతిబింబించే కాల సూచనల
కాలమాని యంత్రంలా కాకుండా ...
సుమ శోభితమైన
సుతి మెత్తని కండరాల
సుందర నిర్మిత సౌధం ..
ప్రాణసాక్షికి పటుతరమయ్యే
లబ్ డబ్ ల మనోరథం ....
మనిషి మనోసంద్రములో
పురుడు పోసుకునే మంచి
చెడుల మతులబులకు
మారుగా బదులిచ్చేది ....
అనంత వాహిని మానసంలోని
ఆలోచనల సుడిగుండాలకు
సుఖదుఃఖాల కష్టనష్టాలకు
కోప తాపాల కొట్లాటలకు
ప్రేమ ద్వేషాల రసానుభూతులకు
ఆత్మీయతానురాగాల సరాగాలకు
అనువుగా లోలకమయ్యేదే....
పంచభూతాలతో పదిలమైనందున
కరిగినప్పుడు మెత్త పడుతూ
వ్యధలలో వరదలా చెరువవుతూ
ధైర్యాలలో గడ్డకడుతూ
భయాలలో కుంచించుకుంటూ
భక్తిలో ఓలలాడుతూ
దరహాసంలోనో నయనంలోనో
ప్రదర్శించి పరిమళించు ...
No comments:
Post a Comment