Tuesday, March 7, 2023

కార్తీక మాసం తేది : 27-10-2022 శీర్షిక : మకుటాయమానం కార్తీకం

 కార్తీక మాసం 

తేది : 27-10-2022
శీర్షిక : మకుటాయమానం కార్తీకం 
కవిత సంఖ్య :170+9

కాలమెంత బలమైనదో 
కాలమెంత విచిత్రమైనదో 
ఋతువు సంధికాలమైన 
బతుకు జీవన పోరాటం... 
శషభిషలు లేకుండా కనిపెట్టిన మానవుడు ... 
కదం కలిపి నడవడమే నేర్చుకున్నాడు. 

కృత్తికా నక్షత్ర సమేతమైనందున  
కార్తీకమై శోభిల్లినది కాల పట్టికలో ... 
హరి హరులకు ప్రీతిపాత్రమై 
నరులకు ముక్తినివ్వ విరాజిల్లినది ... 

తరిగిన వెలుగుల సంపద 
పెరిగిన నిశి పరిధి రాసులు  
సంధి వేళలలో ఆరోగ్య  సంరక్షణలే 
పొందికగా కదంబమే కార్తికమున .... 

శరదృతువులో శంకలేక 
కుంచించుకుపోయే మేనుకు 
విద్వత్తులే వింతగా పారేటి చన్నీటి స్నానం ... 
ఫలితమే ఉల్లమునకు ఓషధుల ఉసిరి... 

జడత్వములను జలదరించుకుని 
ఆధ్యాత్మికతలను జోడించుకుని 
నిర్మలత్వములను పొదువుకుని  
బతుకు సుగమాలకు బాటలు 
వేసుకున్న ప్రతిభాశాలి ... 

ఉసిరి వనమూలికల ఉల్లాస వాసనలు
శ్వాసించిన కలుగు సౌభాగ్యమంటూ 
సమృద్ధమైన  ప్రాణవాయువులను 
సంతులితమై సంగ్రహించ.. ఉసిరి 
వనభోజనాల వంతులేర్పరిచి 
ఘన సంబరాల గమ్మత్తు తెలుపంగ .... . 

స్థితి కారక కేశవ దామోదరం
లయకారక జటాజూట శివోహం 
ఏకోన్ముఖులై జీవ జలాలను
ఆదుకునే మాసం కార్తీకమని ..... 

ఆచారం సంప్రదాయం సమున్నతం 
అన్నీ సశాస్త్రీయం... కలగలిసిన  
హైందవం... నదీ స్నానం ఉపవాసం 
దీప జ్వాల దానం....ఆరోగ్య సూత్రం ... 

సకల జనులను సన్నుతిస్తూ 
సంఘ క్షేమానికి సంక్షిప్తపరిచిరి  
సర్వ శ్రేష్ఠమని  ప్రస్తుతించుతూ 
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం..... 

మాసాలన్నింటికి మకుటాయమానమని
కార్తీకమును కదంబపరిచారు...  
అంతిమాన మిన్న ఆరోగ్యమంటూ 
ఆచరించి చూపిరి ఆర్యులు మనకు...  

No comments:

Post a Comment