Monday, March 6, 2023

శ్లేష కావ్యం తేది : 13-10-2022 శీర్షిక : ఉన్నతత్వం

 శ్లేష కావ్యం 

తేది : 13-10-2022
శీర్షిక : ఉన్నతత్వం 
కవిత సంఖ్య : సహస్రాధికం 

పల్లెనైనా పట్నమైనా తేడా లేకుండా 
లేలేత అరుణవర్ణ కాంతులద్దుకుని 
అందమైన భామగా  సుందరముగా 
ఎదురుచూస్తూ మందహాసం చేస్తావు .... 

వద్దన్నా ! చూపులు నిలిపి  
చూసేంత మంత్రముగ్ధమై 
అల్లంత దూరంనుండే 
అందర్నీ ఆకర్షిస్తుంటావు .... 

వంకలు దీర్చిన వగలుతో 
శంకములేని లావణ్యాలతో 
అన్ని వయసులవారిని 
ఆకట్టుకుని మోహపరుస్తావు ... 

దండిదొరల భవంతులైనా 
మొండిగోడల పూరిళ్లయినా 
చందురుని వెండి వెన్నెల 
నిండుదనమే నీ ఉనికితో ... 

నీలాల కురులతో నిండే 
నీ శ్వాసల పరిమళాలు 
మేని తగిలితే మెరిసిపోయే 
నీ చూపుల గిలిగింతలు .... 

నీ చూపుల బాణాలు 
కొసిరి విసిరి విచలితం 
చేస్తావు ..మది కల్లోలమైతే 
మంద్రహాసం చేస్తావు ....  

పండు వెన్నెలలాంటి 
పసందైన నీ నగుమోము 
చూసి ... కన్ను చెదరని 
కార్త్య వీర్యార్జునులెవరు....  

మా ప్రాంగణపు పూల కుండీలో 
ఒదిగిపోయిన ఓ ముద్దుల 
కనకాంబరమా ... నీ సుద్దులే 
నాకీవేళ స్తుతిమాలాలాయె .... 

అల్పమైనా స్వల్పమైనా 
ఆలసింపక ఆ దేవదేవుని సేవలోనో 
అతివల శిఖలోనో... తరించి 
భాగ్యమందే నీ ఉన్నతత్వమే 
ఉదహరించెద ..... 

No comments:

Post a Comment