Monday, March 6, 2023

ఆఖరి మజిలీ తేదీ 19-10-2022 శీర్షిక : కలబోతల క్షణం

 ఆఖరి మజిలీ 

తేదీ 19-10-2022
శీర్షిక : కలబోతల క్షణం 

ఎంత పరుగెత్తినా ... 
సేద దీరే క్షణం రాక మానదు .. 
అంతరంగంలో బడబాలనం 
సర్దుకోవాల్సిందే ....  

కళ్ళు సన్నగిల్లి చెమ్మగిల్లుతూ... 
చెవులు మందమై శంఖాల పూరింపులు 
కూడ చెవిన పడనపుడు ... 
ముద్ద ముద్దలై మాట పెగలనపుడు...  
కదపలేని కాళ్ళు చేతులతో ...కబోదులమై 
పైకప్పులకు కళ్లప్పగించిన తరుణంలో 
కణికట్టుగ మంత్రించిన ఉపదేశంగా 
కాసింత ఉపశమింపజేసేవి 
కలబోతల క్షణాలే...  

బలాదూరుగ ఆడిపాడిన 
బంగారు బాల్యపు  క్షణాలను... 
జంటగా ఒకటైన కొత్త బంగారు 
లోకాలను...  మరో కోణంలో 
చుట్టివచ్చే సుందర సుమధుర 
దొంతరలు .... 
 
క్షణం తీరికలేక పని 
రాక్షసితో కుస్తీలు పట్టిన
పగలు రాత్రులు పని పాటల 
నిమగ్నమైన వింత రోజులు .... 

అంతా నేననుకున్న మిడిమిడి 
జ్ఞానాల అహంభావాలు ... 
అక్కడక్కడా మితిమీరిన
జీవనరేఖల ఆవేశాల 
అజ్ఞానాలతో  ఆచరించిన 
దోషపూరిత నిర్ణయాలు ... 
ప్రలోభాల ఉచ్చులో 
పడిపోయిన సంఘటనలు ...  
ఆత్మీయతలతో ప్రేమలు 
పంచి చేసిన  సంఘ సేవలు  ... 
అనురాగాల పందిరిలో 
అల్లుకున్న బంధాలు .... 

అనుభవాల పొదిలో 
సమకూర్చుకున్న 
పాప పుణ్యాల మూలాలైన 
ప్రకటిత అప్రకటిత  
మంచి చెడుల తక్కెడలోని 
ప్రతిఫలాల చిట్టాలు .... 
ఒకటనేమిటి సవాలక్ష 
సందర్భాల ..... మననం ... 

No comments:

Post a Comment