వాస్తవ రేఖ
తేది : 11-10-2022
శీర్షిక : ఆత్మ ...పరమాత్మ
కవిత సంఖ్య : సహస్రాధికం
ఆటపాటల బాల్యపు
బంధాలను తప్పించుకోగానే
బుద్దినెరిగిన సిద్దహస్తునిగా
ముద్దుముద్దుగా దరిచేరావు ....
ఆత్మ పరమాత్మల జ్ఞాన బోధనలతో ...
సంశయాల నీలినీడలలో
తచ్చాడుతుంటే ... తమ పర
భేదమెరుగక ప్రశ్నిస్తుంటావు ...
యోగక్షేమాల కారణభూతవై
కంటికి రెప్పలా కాచుకుంటావు ....
కష్ట దుఃఖాల కడలిలో కన్నీరు
మున్నీరయ్యే కాలమానిలో ....
స్థితప్రజ్ఞతల గురూపదేశం చేసి
గురుత్వాన్ని గుర్తించమంటూ
బోధిస్తావు ....
మంచి చెడుల మధ్యన కమ్మరి
కొలిమిలోని కర్రులా నలిగి
పోతుంటే ...మర్మమెరిగి ధర్మం
బోధించి ... దన్నుగా నిలబడతావు ...
తెలిసో తెలియకో పాపంలో
పాలు పంచుకోబోతున్నానని
గ్రహించావో...చెవి మెలేసయినా
చెడ్డదారులు మాన్పిస్తుంటావు .....
కోపతాపాలలో కొంచెం గట్టు దాటి
ప్రవర్తిస్తున్నానని గ్రహించినా ...
మొట్టికాయలేసి గట్టు తెగకుండా
గట్టి ప్రయత్నమే చేసి... నిలువరిస్తావు ...
బుద్ధినేర్చిన క్షణం నుండి
ఆప్త మిత్రునిలా
వెన్నంటి నిలిచి...
మంచి చెడులు నిష్కర్షగా బోధిస్తూ ...
మాధవరూపం లోనున్న మనసువే కదా ....
ఆత్మనావహించిన పరమాత్మవేగా ....
No comments:
Post a Comment