జీవన సంస్కృతి
తేది : 06-10-2022
శీర్షిక : హిమశిఖరం
కవిత సంఖ్య : 170+2
వేద పురాణాలే ప్రాణవాయువులు
ఉపనిషత్తులు ఇతిహాసాలే
ఉచ్వాస నిచ్వాసలు...
భగవద్గీతే మనో నేత్రమవగా
రామాయణ మహాభారత మహాకావ్యాలే
చిరునామాలు....
ప్రకృతికి పబ్బతి పట్టే సత్సంప్రదాయం
నీరు నిప్పు ఆకాశం భూమి పట్టినా
ముట్టినా కళ్ళకద్దుకునే వారసత్వం ....
జగతికే మార్గనిర్దేశమయ్యే జాతి విలువలు ...
కంటికి కానరాని క్రిమి కలబడినప్పుడు
విశ్వమంతా విలవిలలాడుతుంటే
నమస్కారమే విశ్వానికంతటికి
ఉత్తుంగ తరంగ సంస్కారమయ్యింది...
మంచి చెడులను మాటమీద పాటిస్తూ
మదిలో నిలుపుకుని మసలుకునే తత్వం ...
తరాలతో తనువులు పంచుకున్నందుకు
పూజించే పుణ్య చరిత్రల సంతకాలు ....
ఆచార వ్యవహారాలను అక్కున చేర్చుకుని
కట్టూ బొట్టులను కణికట్టుగా పాటించేది ...
శుచి శుభ్రతలకు పెద్దపీట వేసి పొదువుకుని
తిండి తిప్పళ్లను కళ్ళకద్దుకునేది ... .
విశ్వం కన్ను తెరవకముందే వింతలన్నీ
అవపోశన పట్టిన గొప్ప సంస్కృతి ...
బ్రతుకు బ్రతుకనియ్యమనే తత్వం ...
ఆక్రమణలకు అర్రులు చాచని మానసం ...
నాదన్నది వదలకుండానే
పరాయిలది పాపమనే ఆచారం ...
పాప పుణ్యాల సంతులనాల
పర్యవేక్షణలకు ఆధ్యాత్మికతలు ...
భిన్నత్వంలో ఏకత్వాన్ని
సమాదరించే సమున్నత భారతం ...
అనేక మతాలను అక్కున చేర్చుకుని
ఆశ్రయమిచ్చిన హిమశిఖరం ...
No comments:
Post a Comment