Tuesday, March 7, 2023

రాయబడని కావ్యాలు తేది : 27-10-2022 శీర్షిక : రైతు యత

 రాయబడని కావ్యాలు 

తేది : 27-10-2022
శీర్షిక : రైతు యత 
కవిత సంఖ్య : సహస్రాధికం 

అతివృష్టికి భీతిల్లుతూ 
అనావృష్టికి తల్లడిల్లితూ 
అకాల వర్షాలకు అల్లాడుతూ 
ఒంటరి పోరాటాల పంటల 
సైనికుని చరిత్ర .... 

మెతుకు లేక బతుకు లేదని 
తెలిసి...తనను పట్టించుకోని 
దేశ ప్రజలకోసం కోసం కూడా  ... 
తల తాకట్టు పెట్టైనా పాకులాడి 
మట్టిపొరల వైజ్ఞానికుడైన  ... 
అరి గోసల అరక దున్నే రైతన్న
సశేషాల కథా సారాంశాలు  ... 

లాభాలకు మాత్రమే లంకె 
వేసుకుని... పంటలకు 
పరిపుష్టినివ్వాల్సిన  విత్తనాలు 
సత్తువ లేక కూలబడుతున్న 
సీడు కంపెనీల కథనాలు .... 

పంటలకేమో  పని చేయక 
ఆశలకు గండి కొట్టి... నిరాశల 
కొట్టుమిట్టాడే  రైతన్న పానాలకు మాత్రం  
పక్కాగా గండి పెట్టగలిగే నకిలీ 
మందుల నరకాసుర లీలలు .... 

అన్నీ చూస్తూ కళ్ళున్న కబోదిలా 
కదలక మెదలక కథ నడిపించే 
అధికార గణాల ఆగడాలు ... 
పబ్బితి పట్టి ఓట్లడుక్కున్నా 
అన్యాయాలకు కొమ్ము కాసే 
కొంతమంది పాలకుల చరితలు ... 

అబ్బో ...కళ్లారా చూస్తూ కలిసి 
రాని కాలానికి...కష్టాలన్నీ రాశి పోసి 
పూర్ణ కుంభం ఆహ్వానమంపినా 
పుక్కిటి పురాణాల... కదిలిరాని 
నిష్పాక్షిక నిస్వార్థపు ప్రచార 
మాధ్యమాల సంకలనాలు .... 

రాసుకుంట పోతే ... రంది 
లేని బతుకులకు రాజుల
పాలనలే నయమనిపించే…
ప్రజాస్వామ్యం పేరుతో పతనం 
అవుతున్న అనేక సాదృశ్యాలు ... 

No comments:

Post a Comment