కణిక
హృదయ సరాగాలు
బుధవారం బాద్షా
తేది : 26-10-2022
శీర్షిక : నిష్కల్మష ప్రకృతి ..
పచ్చలు పొదిగిన పల్లె తల్లి
ఒడిలో పుట్టి పెరిగిన జ్ఞాపకాలు ...
పెందలాడనే అంబారవముల
ఆస్వాదించిన ఆనందాలు ....
నేర్చుకున్న వర్ణమాలకు
నేర్పరితనం అద్దడానికని నడకన
చదువులకై
పదిమందిమి కల్సి
పక్కూరుకెళ్ళిన పసందైన విషయాలు ...
ఏటి చెట్టు కిందనో ..బావి గట్టుపక్కనో
బుద్ధిపుట్టిన చోటనే సద్దిముల్ లెలు
విప్పుకుని కలుషితాలెరుగని నీటిని
కడుపారా ధైర్యంగా తాగి ఆరోగ్యాలను
అందిపుచ్చుకున్న మరిచిపోలేని
మదిపొందిన ఆనందపు క్షణాలు...
బండ్లబాటలకిరువైపులా చేనులు
పచ్చ తివాచీలు పరుచుకున్న
పసందైన పనోరమా దృశ్యాలు ....
గుండె గూటికి పంచిన సరాగాలు ...
అప్పటికింకా పంజా విసరని పాలిథీన్లు
రైలు రోడ్డు మార్గాలకు ఇరువైపులా
జడలు విరబోసుకోని కలుషితాల
కాలుష్యాల కాటు పడని వాగువంక
చెట్టూ గుట్టా...
కంటికింపైన కమనీయపు పూదోట ...
మహనీయులెవరైనా మళ్ళీ పూనుకుని
ఆపాత నిష్కల్మష ప్రకృతమ్మ ఒడిని
పరమ సుందరంగా కానుక చేసి జీవరాశికి
అందించగలరని ఆశగా పరితపిస్తుంది ....
No comments:
Post a Comment