Thursday, July 9, 2020

తీపి గురుతుల జ్ఞాపకాలు..! 09-05-2020

తీపి గురుతుల జ్ఞాపకాలు..! 
 Dt: 09-05-2020

గడ్డి గుడిశెలు గూన ఇండ్లు 
పిట్ట గోడలు మట్టి తోవలు
పల్లె పిలుపుల పావురాలు 
వావి వరుసల పలకరింపులు 
మచ్చుకైనా దొరకవాయె ..... 

పశువు జాడలు పల్లె నీడలు 
పిల్ల తోవలు బండ్ల బాటలు 
చాదబాయిల చోద్యాలు 
అమ్మలక్కల ముచ్చట్లు 
రచ్చబండల మాటా మంతీ 
మాటవరుసకు కానరావాయె... 

మోట బావులు గడ్డి మోపులు  
ఎడ్ల బండ్లు  వడ్ల కళ్ళం 
గంప గుమ్ములు గాజె దొంతులు 
దొడ్ల గొడ్లు ఆవు దూడలు 
కథలు కథలుగా చెప్పుకోవాలె.... 

బఱ్ఱె తలుగులు కుడిది గోలెం 
దూడ గొడవలు పాల సర్వలు
దాలి పొగలు  సళ్ళ కవ్వం 
పెండ తట్టలు పెంట కుప్పలు 
పేరుకైనా కానరావాయే ....... 

జొన్న చేన్లు జోలె మంచెలు 
తోలు వడిశెల బొమ్మ బెదురు 
గొర్రు నాగండ్లు దౌర కొడవండ్లు  
గొడ్డు గోదలు  గడ్డివాములు 
గోడు ఎల్లబోసుకునుడే సుమా.... 

మర్రి చెట్టుల ఊడలాటలు 
పండ్ల తోటలు కూర పాదులు 
ఈత చెట్ల పండ్ల జాడలు 
తాడి చెట్ల కల్లు కుండలు 
తాతల నాటి తపనలేనాయే...! 

మతుల గతుల యాదులు 
మంచి ముత్యాల సరంజామాలు 
మన మనన జీవన సౌరభాలు  
ఆయుష్షు పెంచే పోషకాలు
తీపి గురుతుల జ్ఞాపకాలు...!

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment