Sunday, July 12, 2020

స్వాప్నిక శ్రీమంతులు తేది : 24-06-2020

స్వాప్నిక శ్రీమంతులు
తేది : 24-06-2020
శీర్షిక : అనితర సాధకులు..
సంఖ్య : 449

చక్రం పనిముట్లయినా....  చిక్కని నిశీధిన
నింగిన దూసుకెళ్లే రాకెట్లయినా 
విశ్వాంతరాలకేగిసే ఉపగ్రహమైనా
ప్రతీది కలలై నిలిచిన మానవ మేధో 
మథనపు ప్రతిపాదిత రూప సమూహాలే..... 

సప్తవర్ణపు కలలు కనడం జన సామాన్యం 
కూర్మ ప్రపంచపు కదలికలు కొందరైతే
పోలికల కబుర్ల పొద్దు పుచ్చేది ఇంకొందరు
చిరుతలా సై అనేవారే సఫలీకృతులయ్యేది..... 

కఠోర పరిశ్రమలను కంఠ హారాలుగ ధరించి 
క్రమశిక్షణలను చంకన బెట్టుకుని  
కన్న కలలను ఆస్వాదిస్తే
పట్టుదల దీక్షలను శ్వాసిస్తే   
పట్టుబడదా అగ్ర తాంబూలం .... 

సుద్దులు బుద్దులు నేర్చిన వాడు
పొద్దుతో సరాసరి పోటీ పడితేనే 
కలల సాకారానికి అవిశ్రాంతంగ కదిలితేనే 
గెలిచి నిలిచేది హిమ శిఖరమై వెలిగేది.... 

అంధకారాలు అలుముకున్నా 
స్వంత కలలను సాకారం చేసుకుని
సంధించుకున్న అనితరసాధకులు 
అప్పుడప్పుడు తారసపడతారు అబ్దుల్ 
కలాములై...... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment