పురి విప్పిన మయూరం
తేది: 30-05-2020
శీర్షిక: ప్రకృతే పరవశించె...
సంఖ్య: 431
ఎదురులేదని విర్రవీగిన ఎడ్డి మానవాళికి
ఎగిసి పడిన కరోనా విసిరె కదా సవాలు
విశ్వమంతా గొల్లుమని గగ్గోలుగా
విధించుకునే స్వీయ నిర్బంధం....
వినువీధులు నిర్మానుష్యమై స్వచ్ఛమై
విహరించే విహంగాలు ఆనందాన
వీధులన్నీ వింతగా నిండిపోయే
వివిధమైన వన్యమృగాలు పక్షులతో పరవశాన....
నదులన్నీ నర్తించే పరిశుభ్రమై
నడయాడి పరుగు లంఘించె
తరులన్నీ కొత్తగా చిగురులేసి
తన్మయత్వం చెందె కదా....
మసక దూరమైన మైదానాలన్నీ
పచ్చ తివాచీలు పరుచుకున్నవి
ప్రాణవాయువు కూడా ఘ్రాణించే
పరిమళాలు అద్దుకునె.....
అల్లంత దూరపు మంచుకొండలు
అలవోకగా దర్శనీయములాయె
ఆకాశాన మనకండగా అడ్డునిలిచిన
అతినీలలోహిత కిరణ తెర సైతం
అత్యంత వేగంగా పునరుద్ధరించుకునె
తనకు తాను...మొత్తంగా ప్రకృతే పరవశించె
పురివిప్పిన మయూరమై .....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment