Sunday, July 12, 2020

కవి హృదయం తేది : 10-06-2020

కవి హృదయం 
తేది : 10-06-2020
శీర్షిక : కనపడని కవ్వం
సంఖ్య : 439

కనులు మూసినా కవాటాలు 
తెరుచుకుని కనపడని కవ్వంతో
చిలికి కమ్మని వెన్నను జనింపజేసి 
మానవీయపు విలువలనద్దే
మహత్వపు మట్టి సువాసనల పాత్ర.... 

ప్రకృతిలో పల్లవించే పదనిసలే 
కాకుండా కాలగమనంలో కదిలే 
కథా కమామీషులను కళ్ళకు కట్టినట్టు 
కదం తొక్కించగల సామర్థ్యం .... 

తెర తెల్లనిదే అయినా
ఎప్పటికప్పుడు నూతన
శోభలను సంతరించుకుంటూ
సప్తవర్ణాలతో శోభిల్ల చేస్తుంది ..... 

రాగ ద్వేషాలను మరిచి 
భావాలను రాశి పోసుకుని 
పదాలతో మాలలు కూర్చి 
అర్ధవంతపు వాక్యాలు అంకురింప
చేస్తుంది....

ఆత్మ సాక్షిని ఆసరా చేసుకుని 
అణగారిన జనం కోసం అడ్డునిలిచిన
వారిని ప్రశ్నించడమే కాదు... 
అప్పుడప్పుడు అగ్గిరవ్వలను సైతం 
జ్వలింపజేస్తుంది .... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment