అలికిడి
తేదీ : 07-07-2020
శీర్షిక : అతి చిన్న శబ్ద సౌందర్యం...
సంఖ్య : 459
అరిచి గీపెట్టేది కాదు
అల్లరి చిల్లరగా చేసేది
అంతకంటే కానేకాదు...
అతి సుకుమారం అత్యంత సుందరం...
పసిప్రాయపు పల్లెల్లో
పచ్చదనాల చేలగట్లల్లో
పయనించే గాలి తెమ్మరలో
పడిలేచే నీటిజాడల వాగువంకల్లో...
అల్లంత దూరాన ఆకాశంలో
విహరించే విహంగాల సంజ్ఞల్లో
పడుచుల కాలి అందియల్లో
పల్లవించే పదనిసల్లో పరికిస్తే
పట్టు దొరుకు అలికిడిలోని ఆనందం...
అభివృద్ధి భ్రమల్లో అలితేరుతూ
పరిశ్రమల పరిభ్ర్రమణాలలో
వాహనాల జీర గొంతుల రణగొన
ధ్వనుల్లో రాటు దేలుతున్న
జనసందోహాలకు అలికిడి చేసే
అతి చిన్న శబ్ద సౌందర్యపు ఆనవాలు
అందులోని ఆనందాలు అవలోకనం అయ్యేనా?
ఆ మాధుర్యం అవగతమయ్యేనా ?
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment