కవితా ఓ కవితా
తేది : 21-03-2022
శీర్షిక : అక్షరాల జల్లువు.
కవిత సంఖ్య : 873
గ్రీష్మ తాపాలకు గిలగిలలాడే
ఒడ్డునపడ్డ చేపపిల్లను నేనయితే
ఓపలేని దూపలు తీర్చే చల్లని నీటి
చలివేంద్రపు ఓదార్పుల సెలయేరు నీవు…
నిత్యం కష్టాల కొలిమిలో పోరాడే
చెమట బిందువును నేనయితే..
నిలువరించే ధైర్య వచనాలు
బోధించే బోధి గురువువు నీవు ...
పలురకాల గుండె గాయాల
ఆశలు వీగిన హాలికున్ని నేను
అన్నపూర్ణకు హారతి పట్టే
మేల్కొలుపు గీతానివి నీవు ....
గాలి దుమారంలో గమ్యం తప్పి
తటపటాయించే గాలిపటం నేను
సంక్రాంతి గాలుల్లో చల్లని సమీరమై
గమనం తెలిపే ఆశవు నీవౌతావు ...
మానస కుహారంలో తంత్రులు మీటే
వీణియలా ...
మది గదిలో మెదిలే మోహన రాగంలా ....
పగలు పలు ఆలోచనల రూపముగా
రాత్రి కనుమరుగవని కలవరింతలుగా
నిర్వహించే ప్రతి పనిలో ప్రతినిత్యం ....
ప్రతి క్షణం నీ మనన పరవశమే ....
మిణుకు మిణుకు నక్షత్రంగానో
మిన్నంటే చుక్కల్లో నెలరాజులాగానో
నన్ను నలుగురికి పరిచయించే
అక్షరాల జల్లువు.. అల్లుకునే సాహితీ పిపాసవు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment