వాలిపోతున్న శ్రమ
తేది: 12-03-2022
శీర్షిక : కారణమేమైనా ....
కథాసారాంశం ఒకటే ....
కవిత సంఖ్య : 235
కారణాలేమైనా... కాలమేదైనా ...
కథాసారాంశమంతా చివరాకరుకు
చిత్రంగా మాత్రం అంతా ఒకటే ....
అంగబలం అర్థబలం విజ్ఞానం
రాజకీయం కలిసికట్టుగా కాకపోయినా
వారి వారి స్థాయిలలో పోరాడుతూ
దాడి చేస్తే దక్కిన శ్రమ ఫలితం .....
అధికార మత్తులో జోగుతున్న వారికి
అవతలి వారి కష్టాలు నష్టాలు
కంటికి ఆనవు ... కరుకు గుండెకు
చేరవు .... కనికరం చూపవు .....
ఒకప్పుడు అంగబలంతో
వంగబెట్టి లొంగదీసుకుని
దాస్య జీవితాలను దఖలు
పరిచారు ... తరాలతరబడి ....
ఆకలికి పేగులు కదులుతుంటే
కూలి డబ్బుల్లో బేరం పెట్టి
కొన్నాళ్ళు కష్టానికి తగిన
ప్రతిఫలాలు అందకుండా చేశారు ....
అధికార పక్షమో ... ప్రతిపక్షమో
అప్పుడు...ఇప్పుడు.... పేదోడికి
చదువులు దక్కకుండా పెద్దోళ్లంతా
కలిసి కట్టుగా ఒక్క మాట మీద
నిలబడుతున్నారు ....
రెక్కలు ముక్కలు చేసుకుని
కాయ కష్టంతో కలో .. గంజో ..
తాగుదామనుకుంటే ....గమ్మత్తుగా
గవర్నమెంటే మత్తులో ముంచేసి ....
చిల్లి గవ్వలను సైతం లాగేసుకుని ....
కుటుంబాలను వీధిన పడేస్తున్నారు ....
సంక్షేమ పథకాల పేరుజెప్పి
సన్నాసి పథకాలు ప్రవేశపెట్టి
సోమరితనాలకు వారసులను చేసి ...
దారి కాచి దండుకుంటున్నారు ....
కార్పొరేటు కల్చర్ లో పుట్టి పెరిగి
కలర్ కాగితాలలో కట్టబెట్టిన
సత్తా లేని సరుకులకేమో..
ధరలు నిర్ణయించుకునే
ధరావత్తుల అధికారాలప్పజెప్పి ....
పేరుకు రైతే రాజంటారు కానీ
పెత్తనము మాత్రం అప్పచెప్పరు…
మద్దతు ధరలకు ముద్రవేయరు…
కాలమేదైనా... కథాసారాంశం ఒకటే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment