Sunday, August 28, 2022

తా మెచ్చినదే తేది: 07-03-2022 శీర్షిక : వింత రోగం

  తా మెచ్చినదే

తేది: 07-03-2022
శీర్షిక : వింత రోగం .... 
కవిత సంఖ్య : 864

అహం బ్రహ్మాస్మి ... 
అవతలి వారంతా గరికవనం 
తన మాటే చెల్లుబాటు కావాలి 
అర్ధ జ్ఞానముల  అహంభావం ... 

అనుభవాలన్నీ చిలక్కొయ్యకు 
వేలాడదీసేసి ...విశాల విజయ 
మూలలను గుర్తించలేని పక్కా 
పరిమిత ప్రజ్ఞాశాలులు ... 

మొండితనానికి పెట్టింది పేరై 
సీతయ్య ఎవరి మాట వినడనే 
చిలకపలుకుల చిరునామాగా 
మారిపోయే ప్రబుద్దులనేకం ..... 

అందరి మాటలు వింటూ 
అందులోని అందాన్ని గ్రహించక
ప్రేమగా సాధించాల్సిన ఏకత్వం  
అధికార మదాల ఆసరాలతో 
ఆడిన ఆటకు పాడిన పాటకు 
చెల్లుబాటు చేసే ప్రయత్నం  ....  

అర్ధబలమైనా...అంగబలమైనా ... 
అధికారబలమైనా ... అన్నీ 
తాత్కాలికమే .... అయినా 
ఆగని పోరాటమే .... 

ఆత్మీయత .... అనురాగం ... 
ప్రేమ ... పెన్నిధి ... మాత్రమే 
శాశ్వతాలని తెలిసినా....
తుంగలో తొక్కేయ్యడమే .... 

ప్రజలచేత పదవులెక్కి 
పదవే శాశ్వతమనుకునే తెంపర్లు .... 
చరితలు మరిచే పాలకులు ... 
అంతా తామే అనే అహంభావపు 
ఆలోచనలే ... తా మెచ్చిందే 
గంగమ్మ  అనే వింత రోగం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment