మసకబారిన
తేది: 20-03-2022
శీర్షిక : రక్షణ విధులు తప్పనిసరి
కవిత సంఖ్య : 237
హిమగిరి సొగసులతో మొదలైన
యమునా గంగల సంగమంలా ...
అనుభవ సారాల ఓషధులతో
ప్రక్షాళన కావించుకున్నట్టు....
అనుభవ పాఠాలతో పవిత్రతలను
మూట కట్టుకోవాల్సిన ప్రజాస్వామ్యం ....
వజ్రోత్సవాలను దాటుకుంటున్నా
విశ్వ నీతి నిజాయితీల పట్టికలో ...
దరి దాపులకు చేరని దాఖలాలేనాయే ...
అవినీతి శ్వాసలతోనే అలితేరుతుండే ...
ఎనభై శాతం మంది కాయ కష్టం మీద
ఎగేసుకొని బతుకుడు నిర్లజ్జగా....చాలా
మంది నాయకులు నేటికీ .....
అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దినోళ్లే ....
ఒక్కసారి పాలకున్ని చేసిన పాపానికి ......
ఆదర్శాలను అటకెక్కిస్తూ
బతుకు తీరులో పాశ్చాత్యం ప్రదర్శించి
పాలన తీరులో ... పతన దశలు
మాతృ భూమి అంటే భక్తి లేదు ....
ప్రజలంటే అనురక్తి లేదు ......
కాసులు తప్ప కంటికేమి ఆనదు ....
అభివృద్ధి మంత్రాలు వల్లిస్తూనే
అణా కానీలన్నీ ఆమ్యామ్యాల పర్వం…
సంక్షేమ పథకాల పేరు చెప్పి
సంకల్ప మంత్రాలు మాత్రం స్వార్థపూరితం…
కరి మింగిన వెలగపండులా
కుంభకోణాల దాణాలు మింగి మింగి
తరాలనన్నీ తనలోనే కలుపుకుంటూ
బ్రహ్మ రాక్షసిలా బలోపేతమాయె.. అవినీతి
ఆరువందలేండ్ల వలస పాలనాలోనైనా
నమ్మకం పోగొట్టి నడిచొచ్చిన రోజులలోనైనా
వినీలాకాశంలో వింత నక్షత్రంలా మెరవాల్సిన
దేశం ...మసక బారిన చరిత్ర పుటలనే
మిగిల్చె ... నేటికీ ... విశ్వ వేదికలలో ....
అక్షర జ్ఞానాలతో పాటుగా...పాలనకు అర్హతగా
అమ్మ రక్షణ విధులు తప్పనిసరితో ...
కొంతలో కొంత మేలై ... తేట తెల్లమౌనెమో ..
గుడ్డిలో మెల్ల నయమోలే ...మసక తీరి పోతుంది.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment