నైతిక మద్దతు
తేది 14-03-2022
శీర్షిక : మానవత వివేచనలు
కవిత సంఖ్య : 868
పశు పక్ష్యాదులకు లేని
పట్టింపులు మానవాళికేలనో ....
విజ్ఞావంతున్నంటాడు ....వింతగా
వితండవాదాలు చేస్తుంటాడు ....
కష్టాల కొలిమిలో కార్మికులకు వాతలు
పెడుతూ…ఒకటికి ఒకటి ఉచితమంటు
లంకెలు బెట్టి లాభాలు కొల్లగొడుతూ
జేబులు గుల్ల చేసే కపట ప్రేమలు
ఒడువని వ్యాపార దిగ్గజ ప్రకటనలు ...
మద్దతు ధరలు కూడబెట్టలేని
పొట్ట కూటి పోరాటం చేస్తూనే ...
ప్రకృతి...పరిస్థితులు...పగబట్టినా
పంటచేలను అంటిపెట్టుకుని జనాలకు
పట్టెడన్నం పెట్టడానికే రైతుల పాట్లన్నీ ....
వాతానుకూల సమావేశాల గదుల్లో
వందిమాగదుల పర్యవేక్షణలలో
రాజధాని నడిబొడ్డులో నాట్యమాడే
పాలకులకు రాచమర్యాదల నజరానాలు ... .
పొరుగుల ఈర్ష్యా అసూయ ద్వేషాల
నిప్పుల కొలిమిలో తనువులు తాకట్టు పెట్టి ...
ఎండా వాన చలిలలో... ఏకాంత జీవనాలతో
చుట్టూ పహారాలు కాస్తూ .... ప్రాణ త్యాగాలకు
పాల్పడే సైనికులకేమో చాలీ చాలని సౌకర్యాలు...
కావాల్సిందల్లా విజ్ఞుల మనోబలమే ....
కలసికట్టుగా మానవత నిలబెట్టగలిగితే…
గడ్డిపోచయినా...దొడ్డు తాడై కలబడి
గజాన్ని కూడా కట్టిపడేయగలదు ....
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు
అర్ధబలమో ... అంగబలమో ....
అధికారబలాలో రాజ్యాలేలుతుంటే ..
బడుగు బలహీనుల బతుకులెలా ....
ప్రజల్లోనైనా…పాలకుల్లోనైనా....
మంచిని హత్తుకునే మానవతల
వివేచనలు విస్తరించినపుడే ...
మంగళ హారతులు పడదాం ....
మనమంతా నైతిక మద్దతుగా....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment