Monday, August 22, 2022

యుద్దానంతర దృశ్యం తేది:02-03-2022

 యుద్దానంతర దృశ్యం

తేది:02-03-2022
శీర్షిక: హృదయ విదారకమే .... 
కవిత సంఖ్య : 860  . 

విజ్ఞాన వంతులం అని విర్రవీగే 
మనిషి క్షణం ఆలోచిస్తే బాగుండు ... 
వింతగా గుప్పిట దాయాల్సిన 
బ్రతుకులను  వీధి పాలు చేస్తున్నడు .... 

యుద్ధాలెప్పుడో ధర్మాలను 
మరిచిపోయి  దారితప్పాయి  .... 
విద్యాలయం వైద్యాలయం 
బడి గుడి తేడాలే లేవాయే ఈనాడు ...  

ఏక్కువో తక్కువో ఆవైపో ఈవైపో 
తెలియదు కానీ జరగరాని నష్టం ... 
తలుచుకుంటే నివారించగలిగే 
విజ్ఞాన సంపదల వినాశనం  ....
అమ్మలందరి ఆక్రందనలు ...  

తమ పర భేదమెరుగని  తూటాలు 
జల్లెడ రంధ్రాలను తలపిస్తుంటే 
తుపాకీ గుండ్లేమో .... గుండెలన్నీ 
చీల్చుకుంటూ మానవ కళేబరాలను  
ఆరేస్తూ పోయే చాకలి రేవే  ..... 

వడగళ్ల వానలా  బాంబుల 
వర్షం కురుస్తుంటే... చీడ తగిలిన 
చేనులా మాడి మసి బారి కుప్పకూలుతున్న 
కట్టడాలను చూడలేక కళ్ళు జల 
జల కన్నీటి బోట్లను రాలుస్తున్నయి .... 

అన్నమో రామచంద్రా అంటూ 
ఆడమగా  పిల్లా పాపలు ముసలి 
ముతకల అలమటింపులు 
క్రిమిబాధల మర్రిమానులా... ఈర్ష్యా 
ద్వేషాల మూలాలకు కుప్ప 
కూలుతున్న ఆకాశ హర్మ్యాలు ... 

దైవత్వం ధైర్యం చేసి దండించి 
రాక్షసత్వాల మదమణచితేనె ....  
మానవాళి మనుగడకు బాటలు 
వేసి అవనిపై వసంతాలు విరిసేది ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment