మహిళా దినోత్సవం
తేది: 07-03-2022
శీర్షిక : తీరని ఋణమే….
కవిత సంఖ్య :
మహిళలంటేనే మమతల పుట్టిల్లు
ఆత్మీయతలకు అమ్మైన ఆనవాళ్లు
అనురాగాలకు చిట్టిచెల్లెళ్ళ చిరునామాలు
అనుబంధాలకు ఆలి రూపాన సాక్ష్యాలు
ఆనందాలకు కూతురైన అమోఘ క్షణాలు…
మమతల ఒయాసిస్సు లైన
మహిళామణులు లేకపోతే .....
మగవాడెంత గొప్పవాడైనా
ఎండి మోడువారిన ఎడారే ....
మాతృమూర్తిగ మధురమైన ఓర్పులు
తరాలను కని పెంచే కమ్మని నేర్పులు
మానవాళి పురోభివృద్ధికి మహా వారధులు
మనుగడల చైతన్యానికి తేజో దీప్తులు ....
అనుభవాల రంగరింపులో జిజియాబాయి
అపర కాళికలైన రుద్రమ ఝాన్సీ బాయీలు
అక్షరాల తోవలో అలితేరిన పూలేబాయిలు
వివక్షలెన్నో దాటుకుని విశ్వ గగనంలో
వీర విహారాలు చేసిన మహిళామణులు…
స్వాభిమానంలో సర్వోత్క్రుష్టం
స్వావలంభనంలో ప్రతిభా పాటవం
అది ఇదియను తేడాలేక అంతటా వ్యాపించి
వ్యక్తిత్వానికే వన్నె తొడిగాయి నేడు
విజయ కీర్తి పతాకాల రెపరెపలుగా ….
త్యాగాలకు తొలి అడుగు
సహనాలకు మారుపేరు
సమతామూర్తిగ సదా నిలుస్తూ
మానవాళికే మచ్చలేని కాగడా….
నిత్యం తన అడుగుల నీడలే
గొడుగులైన మానవాళి మాత్రం
ఒక్కరోజుతో సరిపుచ్చాలనుకోకుండా
ప్రతీ రోజు పాటించినా తీరని ఋణమే ….
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment