నడిచే గాయాలు / నిత్య గాయాల నది
తేది: 04-03-2022
శీర్షిక : రాజకీయం
కవిత సంఖ్య : 862
తనువు గాయాలకు తల్లడిల్లినా
నాలుగు రోజుల్లో దులిపేయచ్చు ...
మనసు గాయాలు మాత్రం
నరం మీది కురుపులా సలపరమే ....
ఆత్మీయతా లతలకు
మానవీయతా మమతలకు
అనుభవ కుసుమాల సొబగులద్ది
అవధులు పెంచాల్సిన పాలకులు .....
అహాల ముల్లులతో ఆడిస్తూ
వృశ్చిక నీతిని వ్యక్తపరుస్తూ
మతాల పేరిట మసి పూస్తూ .....
కులాల పేరిట కుంపట్లు
రాజేస్తున్నారు .....
ప్రాంతాల పేరుతో పాయ దీసి
కుత్సితాలతో కుళ్ళు వెదజల్లుతున్న
పేరున్న పెద్దోళ్ల గారడీ ఆటలో
ఏమెరుగని యువతను నిర్వీర్యం చేసి
దేశ భవితను ఫణంగా పెడ్తున్నరు ....
కలిసి ఉంటే కలదు సుఖమని
కాగితాలలో కమ్మగా చదువుకున్నా ....
తెల్లోడి మాయలో ... తెలివి మీరిన
పనులో.. ఫక్తు విడగొట్టి పాలించే
విధానాలకే మొగ్గు చూపుతున్నారు ...
గల్లీనుండి ఢిల్లీదాకా
వీధులనుండి విశ్వాంతరాల వరకు
ప్రజాజీవితం నిత్య గాయాల నదిగా
రావణకాష్టమై రగులుతూనే ఉంది
పాలకుల రాజకీయపు రంగులతో ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment