చెట్టు నా ఆదర్శం
తేది:03-03-2022
శీర్షిక : జీవితాంతం సేవలే ....
కవిత సంఖ్య : 861
పల్లె పట్టున పెరిగిన నాకు
పచ్చని చెట్లతో సావాసమే ....
పుట్టి బుద్దెరిగినాక ఇంటిచుట్టూ
పెట్టిన చెట్లన్నీ పచ్చలు పొదిగినయి ....
పోషకాల ఖర్చంటూ లేనే లేదు ....
రోజుకో చెంబుడు లేదా బకెట్ నీరు
అప్పుడప్పుడు వేసే పశువుల పేడతోనే
బలాదూరుగా పెరిగిపోయి.... నన్ను
ఎప్పుడో మించి పోయాయి ఎత్తులో ...
దినకరుని గ్రీష్మ తాపాలను
శీతల వాయువుల వీవెనలతో
అణకువగా తలలూపుతూ
అనుంగు సోదరుడై నన్ను నిత్యం
కాచుకునేవి ....
కాలానుగుణంగా పూత పూసి
ఉగాది పండగల ఉత్సవాన్ని
ఉర్రూతలూగించేది .... ఇంకొన్ని
కాత కాసి..స్వార్థాల సంచులు
నింపుకోకుండా మా ఇంటిల్లిపాదికే
కాకుండా ... వీధి వీధంతా కమ్మటి
ఫలాలతో కడుపులు నింపేవి..కనిపెట్టుకునేవి ....
జీవనయానంలో నేను ఊళ్లు
తిరిగినా... అవి మాత్రం
అమ్మా నాన్నలతో ఊసుల్లో
మునిగిపోయాయి ...
అమ్మానాన్నలు అమరులయ్యాక
ఎవరు పట్టించుకున్నా ....
పట్టించుకోపోయినా ....ఈనాటికీ
వాటి స్వయంప్రభలతో
సంతోషాలను పంచుతూ సంతృప్తులు
మూట కట్టుకుంటూనే ఉన్నాయి ...
ఊరివారందరితో .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment