Wednesday, November 9, 2022

మనిషిని చూస్తే భయమేస్తుంది...

 మనిషిని చూస్తే భయమేస్తుంది... 

 
మనుషుల పక్కన నడుస్తుంటే
సెలనీటి ఒడ్డున సేదదీరినంత
మనసుకు హాయి కలగాలి కాని
కళ్ళు కెమెరాలయి కాల్చుతున్నట్టు
కంకర రాళ్ళమీద నడిచినట్టుంది…. 

ప్రతి మాటలో పచ్చి బూతులు 
వెదుకుతూ స్కానింగు చేస్తుంటే
భయం భయంగా పిట్టబతుకై 
టపటపల మనస్సాక్షి తటపటాయిస్తున్నది… 

పట్టు ధోవతి పంచె కట్టి  బోనమోలె 
నుదుటి పైన బొట్టు మీద బొట్టు పెట్టి..
సాంప్రదాయానికి కట్టుబడిన 
స్వామివారి లెక్కన కనపడినా… 

కనపడని కోరల విషనాగులై
పంజా విసరని క్రూరమృగాలై 
వింతగా బుసలు కొట్టకుండానే 
కసిదీరా కాటేసే లోకమయింది… 

నమ్మి నానబోసుకుంటే...పుచ్చిపోయి 
బూరెలయినట్టు ... నమ్మకంతో 
నడుముల లోతు దిగంగానే ... పుట్టి 
ముంచి..గట్టు మీద జల్సాలు చేస్తున్నరు ... 

మనిషిని చూడంగానే... 
సుందరమైన బంధమేమి  లేకున్నా 
మమత బంధుత్వాలతో పిలుసుకునే 
పల్లె పరిమళాలు విచ్చుకోవాలే ...కానీ .. 

సాంకేతికతల కనుసన్నల్లో 
సడేమియాలలా ...కింద మీద వదిలి  
మధ్య దొంతరలు మాయంచేసే 
మాయల మరాఠీలు మదిలో 
మెదులుతున్నరు... 

నిరక్షరాసులైనా.. సరే అందమా అంటే 
నిలువునా ముంచే ఎంతో మంది నాయకులు ... 
అక్షరాస్యుల ముచ్చటకొస్తే... కొంత మంది  
ఐ ఏ ఎస్, ఐ పి ఎస్  లనుండి  మొదలుకుని 
ఉన్నత పట్టాల ఉడుతలు పట్టే నైపుణ్యుల వరకు .... 
ప్రజల జీవితాలతో పరాచికాలాడుతున్నారు ... 



No comments:

Post a Comment