ఎక్కిరింపు మాట
తేది : 16-06-2022
శీర్షిక : భాష్యమై వెలుగొందాలి ..
కవిత సంఖ్య : 921
మాటెప్పుడూ మంచి ముత్యమై
మెరవాలి .... కంచు కోటలా ...
కవాతు చేయాలి... గాలి మాటలతో
గడబిడలు చేస్తూ పుట్టి ముంచద్దు ..
పుర్రెకో గుణం జిహ్వకోరుచిలా
పరాష్కారాలతో పందిరివేసి
నిష్టూరాలను నిగూఢ పరిచి
మాటకారితనంతో మూటలు
నెత్తికెత్తుతారు ....
తమ తప్పొప్పుల నీడలను
ఎవరైనా పసికడుతారేమోననే
భయం గుప్పిట్లో బ్రతుకుతూ..
భ్రమలతో....హాస్యాలను అలికి
ముగ్గేసి వెటకారాన్ని తూటాలా సంధిస్తారు ....
తమకు తామే అధికారం
దఖలు పరుచుకుని...
ఎదుటివారంతా ఎర్రి నాగన్నల
లెక్కల్లో జమలు కట్టేస్తారు ...
మిత భాషి అయినా మంచిదే ...
ప్రతి మాట ఒక భాష్యమై వెలుగొందాలి ...
నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెంచాలి ...
ఆలస్యమైనా అమృతమై ప్రాణం
నిలపాలి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment