Wednesday, November 9, 2022

జీవ ద్రవ్యం తేది : 06-07-22 శీర్షిక : ధైర్యపు సెలయేరు

 జీవ ద్రవ్యం 

తేది : 06-07-22
శీర్షిక : ధైర్యపు సెలయేరు 
కవిత సంఖ్య : 929

ఇంతింతై వటుడింతై అయినా  ...   
కంటికి కనిపించే భౌతికం కాదు  
కాగడాలతో వెదికితే దొరకదు
కాదు పొమ్మంటే పారిపోయేది కాదు ... 

ఏకాంతంలో ఒంటినిండా చేరిపోయి 
శివసత్తిలా ఆవహించుకుని 
అడుగడుగున అనుమానాలు 
రేపుతూ ... అడుగేయాలంటేనే 
ఆలోచనలో పడే సందర్భాలు ..... 

ముందుకెళ్తే నుయ్యనుకుని 
వెనుకకెళ్తే  గొయ్యనుకుని 
కదలలేక మెదలలేక ... కబోదిలా 
కాలం వెళ్లదీయమంటది .... 

గర్భకుహరంలో చీకటి వాకిటి
నిర్భయపు వెలుగుల ఒంటరే...   
క్రూర మృగాలను వేటాడిన 
 ధైర్య సాహసాల పయనం ఒంటరే  ..... 

జీవరాశిలోనే మిన్నని తలిచే 
మనం ... మననంతోనే మనసులో 
ధైర్యపు సెలయేరులు ప్రవహింపజేసుకుని .... 
విజ్ఞానం...వివేకాల...జోడింపులతో 
విజయ తీరాలను ముద్దాడాలి .  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment