Wednesday, November 9, 2022

బతుకు నేర్పిన పాఠం తేది: 20-07-2022 శీర్షిక: ఈనాటి చదువులు.

 బతుకు నేర్పిన పాఠం 

తేది: 20-07-2022
శీర్షిక: ఈనాటి చదువులు. 
కవిత సంఖ్య: 941

పల్లె జీవనంలో పరిమళించిన 
చల్ల గాలుల మధ్య పుట్టి పెరిగి
రక్తం పంచుకోని పుట్టకపోయినా 
పల్లెజనులతో అల్లుకున్న బంధాల 
వావి వరుసల పిలుపుల సౌందర్యం ..... 

నడిచొచ్చిన కాలపు అడుగుల
ఆనవాళ్లను పరిశీలించుకుంటే.. 
గుర్తుకొస్తున్నాయి అడుగడుగున 
అనుభవాల తోటలోని మధుర క్షణాలు .....  

స్వచ్ఛమైన ప్రాణవాయువులిచ్చే 
చెట్ల నీడలలో సేదదీరుతూ  
స్వేచ్ఛగా నేర్చుకున్న పాఠాలతో  
రాటు దేలిన మానసిక బలమెంతో... 

ఆటపాటల ఉల్లాసాల ఊసుల
జాడలు లేకుండానే అలిసిపోతున్న 
నేటితరం పిల్లలు... నిర్బంధపు 
చదువులమ్మ ఒడిలో రాలిపోతున్న 
క్షణాల మానసిక దౌర్భల్యాలు .... 

నాన్నను అయ్యాక గాని నమ్మకం కలగని 
అమ్మ మాటలలోని మతలబుల మర్మం  
నాన్న చేతలలోని  బాధ్యతల బరువులు 
గురువుల బోధనల గురి కలిగిన మాటలు
నిన్నటి మీద నేటి జ్ఞానపు వెలుగులతో .... 

దీపపు వెలుగుల ప్రాథమిక విద్యల ఓర్పు  ... 
వాగులు వంకలు దాటుకుంటూ పట్టుదలల 
కాలినడకలే కష్టమైన ప్రయాణ మార్గాలతో  
సాగిన ఉన్నత బడి చదువుల సంకల్పం...  
ఉన్నతంగ ఉద్యోగాలతో నిలిపిన గమ్యం .... 
ఉదాహరణలే ఎప్పుడు మా పిల్లలకు .... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

No comments:

Post a Comment