వెంటాడే కవిత్వం
తేది: 27-06-22
శీర్షిక : పరితపన
కవిత సంఖ్య : 923
వారసత్వపు ఆస్తులు కావు
వరసపెట్టి వాలడానికి….
అడిగినప్పుడల్లా ఆత్రపడవు
చెప్పినప్పుడల్లా చెవికెక్కవు .....
ఎప్పుడంటే అప్పుడు
ఎగిరి గంతేయవు ....
కనులు కాంచిన వెంటనే
కల్లోలమయ్యే మనసుకు ....
చెవుల చెంతకు చేరినంతనే
చంగున దూకే స్పందనలకు ....
విషయ మననంతోనే
మస్తిష్కం పరంపరలన్నీ
అడుగడుగున తడబడి
అక్షరాల దొంతరలైపోతాయి…
స్వార్థాలను చంక దించి
త్యాగాలను తలకెత్తుకునే
పూదోటల మకరందం ....
పున్నమి రాత్రుల కౌముది ....
బడబాగ్నులను చల్లార్చే
చిరుగాలుల శీతల పవనమై
కాయకష్టం చేసే వారి
కంట నీరు తుడవగలిగేది ...
అప్పుడప్పుడు అధికారాలను
అడ్డం పెట్టుకుని అరాచకాలను
వెలగబెట్టే వెర్రి నాగన్నలను సైతం
నిలదీసే నిఖార్సైన అంకుశమౌతుంది…
మది సంద్రపు అలలను
కలబోసి మేలిమిగా ఒడిసిపట్టి
విశ్లేషించి వింతగా పరిమళాలద్ది
పరిష్కార సూచనల పరితపనలతో
ప్రస్తావించే వరకు వెంటాడుతూనే ఉంటుంది.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment